వాటిపై జి.ఎస్.టి. తగ్గించండి మహాప్రభో!

June 15, 2017


img

ఇంతవరకు జరిగిన జి.ఎస్.టి.కౌన్సిల్ వరుస సమావేశాలలో వివిధ ఉత్పత్తులు, వస్తువులు, సేవలపై పన్ను శ్లాబులను ఖరారు చేసేశారు. మరొక 15 రోజులలో దేశవ్యాప్తంగా జి.ఎస్.టి. అమలులోకి రాబోతోంది. దాని అమలును మరికొంత వాయిదా వేసే అవకాశం ఉందనే పుకార్లను నమ్మవద్దని, ఎట్టి పరిస్థితులలో జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జి.ఎస్.టి. అమలుచేసి తీరుతామని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ గట్టిగా చెప్పారు. అయితే దాదాపు అన్ని రాష్ట్రాలు ఏదో ఒక వస్తువు, లేదా సేవలపై విధించిన జి.ఎస్.టి. పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. కేంద్రవిమానయాన సంస్థ సైతం తమకు మరో రెండేళ్ళ పాటు జి.ఎస్.టి. నుంచి మినహాయింపునివ్వాలని కోరడం విశేషం. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపారులు జి.ఎస్.టి.ని వ్యతిరేకిస్తూ గురువారం స్వచ్చందంగా బంద్ పాటించారు. 

ఇక తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి జి.ఎస్.టి. వడ్డింపుల వలన బీడీ కార్మికులు, గ్రైనైట్ పరిశ్రమలు దెబ్బ తింటాయని కనుక వాటికి జి.ఎస్.టి. నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి ఈరోజు లేఖలు వ్రాశారు. రాష్ట్రంలో  బీడీ, గ్రానైట్ పరిశ్రమలపై లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని వాటిపైనే గరిష్టంగా జి.ఎస్.టి. విధించడం వలన ఆ పరిశ్రమలు నష్టాల బారినపడి మూతపడితే వాటిపై ఆధారపడిన వారందరూ రోడ్డున పడతారని కనుక వాటిని జి.ఎస్.టి. నుంచి మినహాయించాలని కేసీఆర్ కోరారు. అవికాక రైతులకు, వ్యవసాయానికి లబ్ది చేకూర్చే సాగునీటి ప్రాజెక్టులను, ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చే మిషన్ భగీరథ ప్రాజెక్టులను కూడా జి.ఎస్.టి. నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

పొరుగునే ఉన్న ఏపి కూడా ఇంచుమించు ఇదే కోరుతోంది. ఇంకా అనేక రాష్ట్రాలు వివిధ వస్తువులు, సేవలపై జి.ఎస్.టి. తగ్గించమనో లేదా పూర్తిగా మినహాయించమనో కోరుతూ కేంద్రప్రభుత్వానికి విన్నపాలు చేసుకొంటున్నాయి. కానీ వాటన్నిటినీ మన్నించడం కష్టం అలాగని మొండిగా కాదనడం కూడా కష్టమే. కనుక రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు జి.ఎస్.టి.లో ఇంకా ఏమేమి మార్పులు చేర్పులు వస్తాయో చూడాలి.        



Related Post