భూములు పోలేదు కానీ ప్రభుత్వం చేతిలో లేవు?

June 15, 2017


img

ఇటీవల మియాపూర్, మేడ్చల్ తదితర ప్రాంతాలలో బయటపడిన భూకుంభకోణాలలో ప్రభుత్వం ఒక్క గజం భూమి కూడా కోల్పోలేదని ఒక్క రూపాయి కూడా నష్టపోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. చట్టపరంగా చూస్తే అది వాస్తవమే కావచ్చు కానీ సాంకేతికంగా చూస్తే అది వాస్తవం కాకపోవచ్చు. 

ఏవిధంగా అంటే, వాటి రిజిస్ట్రేషన్లలో చాలా అవకతవకలు జరిగాయి..ప్రభుత్వం ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది కనుక, చట్ట ప్రకారం ఆ భూములు ప్రభుత్వం అధీనంలో ఉన్నట్లే లెక్క. కానీ వాటిపై కొందరు లావాదేవీలు నిర్వహించారు కనుక అవిప్పుడు వివాదాస్పదమైన భూములుగా మారాయి. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. ఆ కేసులు తేలి అవి ప్రభుత్వ భూములేనని కోర్టులు అంతిమ తీర్పు చెప్పేవరకు అవి ప్రభుత్వం స్వాధీనంలోకి రాకపోవచ్చు. 

కేసీఆర్ చెప్పినట్లు వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం వలన ఆ భూములు మళ్ళీ ప్రభుత్వం అధీనంలోకి తీసుకురావడం నిజమనుకొంటే, అదే విధంగా రాష్ట్రంలో కబ్జాకు గురైన అన్ని ప్రభుత్వ భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు కదా? కానీ అలాగ జరుగడం లేదు. 

దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగాయి..ఇంకా ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని అనేక చేతులు మారి ఉంటాయి కూడా. వాటి స్వాధీనం కోసం దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనేక దశాబ్దాలుగా కోర్టులలో పోరాడుతున్నాయి అయినా ఆ కేసులు ఇంకా నడుస్తునే ఉన్నాయి. అయితే వాటిలో చాలా భూములు నేటికీ ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల అధీనంలోనే ఉన్నాయి. కొన్ని యధాతధస్థితిలో ఎవరికీ ఉపయోగపడకుండా వృధాగా పడిఉన్నాయి. 

ఉదాహరణకు ఏపిలో అమరలింగేశ్వర స్వామి ఆలయానికి చెన్నై సమీపంలో మహాబలిపురంలో 83 ఎకరాల భూమి ఉంది. వాటిని సదావర్తి సత్రవ భూములని అంటారు. అత్యంత విలువైన ఆ భూములు చట్ట ప్రకారం ఏపి దేవాదాయశాఖ అధీనంలో ఉన్నాయి. కానీ వాటిలో చాలా వరకు ఆక్రమణలకు గురవడంతో మిగిలిన వాటిని స్వాధీనం చేసుకోలేక, కాపాడుకోలేక అయినకాడికి అమ్మి వేయవలసి వచ్చింది. వాటిని అమ్మివేసినా వాటికీ చట్టబద్దత కల్పించడం తనవల్ల కాదని ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఆ ‘రిస్కు’ తీసుకోవడానికి సిద్దపడిన కొందరు పార్టీ పెద్దలే వాటిని మూడో కంటికి తెలియకుండా చవకగా కొట్టేశారని వైకాపా ఆరోపించిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు మియాపూర్ భూములదీ అదే పరిస్థితి అని చెప్పవచ్చు. ఆ భూముల బదలాయింపు రద్దు అయ్యుండవచ్చు కానీ అవిప్పుడు వివాదాస్పద భూములు. కోర్టులో ఉన్నాయి. చట్ట ప్రకారం ఆ భూములు ప్రభుత్వానివే కానీ ఒకవేళ నిందితులు దీనిపై న్యాయపోరాటం మొదలుపెడితే కోర్టు అంతిమ తీర్పు వెలువడే వరకు ప్రభుత్వానికి వాటిపై అధికారం ఉండకపోవచ్చు. కనుక ఆ భూములు ప్రభుత్వం చేతిలోనే ఉన్నట్లు భావించలేము. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పుడే న్యాయనిపుణులు, రెవెన్యూ అధికారుల అభిప్రాయం తీసుకొని ముందుకు సాగితే మంచిదేమో? 


Related Post