అక్కడ బాబు..ఇక్కడ కేసీఆర్..సేమ్ ప్రొబ్లెమ్స్

June 15, 2017


img

రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి బారీ భూకుంభకోణాలు బయటపడటం, వాటిలో మంత్రులు, ముఖ్యమంత్రులపై ఆరోపణలు రావడం యాదృచ్చికమే అయినా చాలా విచిత్రంగా ఉంది. విశాఖలో బయటపడిన భూకుంభకోణంలో ఆ రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి హస్తం ఉందని మరో మంత్రి అయ్యన్నపాత్రుడే అంటున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రశ్నిస్తున్నారు. దానిలో ముఖ్యమంత్రికి, ఆయన కొడుకు లోకేష్ కు వాటాలు ఉన్నాయి కనుకనే గంటాను వెనకేసుకొని వచ్చి మెల్లగా ఈ వ్యవహారాన్ని అటకెక్కించేయాలని చూస్తున్నారని రోజా ఆరోపిస్తున్నారు. మంత్రులే ఒకరినొకరు వేలెత్తి చూపించుకొంటుంనందున వైకాపా ఆరోపణలకు తెదేపా గట్టిగా తిప్పికొట్టలేని పరిస్థితిలో ఉంది. 

ఇక తెరాస సర్కార్ కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితులనె ఎదుర్కొంటోంది. అయితే ఇక్కడ మంత్రులెవరూ సాటి మంత్రులను, ప్రభుత్వాన్ని వేలెత్తి చూపకపోయినప్పటికీ, మియాపూర్ కుంభకోణంలో మొట్టమొదట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఆరోపణలు రావడం, ఆ తరువాత తెరాస రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, డి శ్రీనివాస్ లపై ఆరోపణలు రావడంతో తెరాస సర్కార్ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. 

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భూకుంభకోణాలపై దర్యాప్తుకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం (సిట్)ల ను ఏర్పాటు చేశాయి కానీ ప్రతిపక్షాలు సిబిఐ  చేత దర్యాప్తు జరిపించాలని గట్టిగా పట్టుబడుతున్నాయి. తెలంగాణా ప్రతిపక్షాలు గవర్నర్ నరసింహన్ ను కలిసి దీనిపై పిర్యాదు చేశాయి. త్వరలో ఏపి ప్రతిపక్షాలు కూడా పిర్యాదు చేయవచ్చు. 

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి ఒకే రకమైన సమస్యలో కూరుకుపోవడం విచిత్రంగానే ఉంది. కనుక దీని నుంచి బయటపడటానికి రెంటిలో ఏదైనా ఉపాయం కనిపెడితే రెండవది కూడా దానిని కళ్ళుమూసుకొని అమలుచేసేయవచ్చు. 


Related Post