ఇంతవరకు అప్రతిహాతంగా సాగుతున్న తెరాస సర్కార్ కు..దాని ముఖ్యమంత్రి కేసీఆర్ కు మియాపూర్ భూకుంభకోణంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే కనిపిస్తోంది. ఆయన స్వయంగా దీనిపై ఎన్ని వివరణలు ఇస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు దాడులు ఆపలేదు. ఆయాచితంగా లభించిన ఈ బలమైన ఆయుధంతో ప్రతిపక్షాలు నేరుగా ఆయననే లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడి చేస్తూ ఊపిరి సలపకుండా చేస్తున్నాయి.
దీనిపై మొదట తెదేపా నేతలు ఆయనపై విమర్శల వర్షం కురిపించి గవర్నర్ నరసింహన్ కు పిర్యాదు చేశారు. తరువాత కాంగ్రెస్ నేతలు నిన్న మియాపూర్ భూములలో పర్యటించి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఈరోజు వారు కూడా గవర్నర్ నరసింహన్ కు ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై పిర్యాదు చేయబోతున్నారు. వారి తరువాత భాజపా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శల వర్షం కురిపించింది.
ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి నిన్న తమ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు వింటుంటే ఆయనే స్వయంగా ఈ కుంభకోణంలో నిందితుల తరపున వాదిస్తున్నట్లున్నారు. భూములు రిజిస్ట్రేషన్లు జరిగిన మాట వాస్తవమే కానీ బుక్ నెంబర్: 1కి బదులు 4లో నమోదు చేసినందున ప్రభుత్వానికి ఏమి నష్టం లేదని ఆయన చెప్పడం ఏమిటి? ఈ కేసులో నిందితులు ఈ భూముల కోసం ఇకపై న్యాయపోరాటం చేయరని కేసీఆర్ భరోసా ఇవ్వగలరా? గజం భూమి కూడా పోలేదని చెపుతున్నప్పుడు కేశవరావు పేరిట చేసిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ ఎందుకు రద్దు చేస్తున్నట్లు? తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూదందాలు చేసినందుకు జైల్లో పెట్టించిన కేసీఆర్, తన పార్టీ నేతలైన కేశవరావు, డి. శ్రీనివాస్ లను ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? తమ ప్రభుత్వంలో ఎవరూ తప్పు చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తే తక్షణమే సిబిఐ దర్యాప్తు కోరాలి. అంత ధైర్యం లేకపోతే తక్షణమే రాజీనామా చేసి తప్పుకోవాలి,” అని నాగం జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
భాజపా సీనియర్ నేత ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గ్రూప్-2 పరీక్షల నిర్వహణ మొదలు మియాపూర్ భూముల వరకు తెరాస సర్కార్ లో అన్నీ కుంభకోణాలే. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలలో మునిగితేలుతోంది. ఈ కుంభకోణంపై అధ్యయనం చేసిన ఎస్.కె. సిన్హా కమిటీ నివేదికను ప్రభుత్వం తక్షణం బయటపెట్టి సిబిఐ దర్యాప్తు జరిపించాలి,” అని అన్నారు.