తెలంగాణా ప్రభుత్వాన్ని పట్టికుదిపేస్తున్న భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులతో మంగళవారం సుదీర్గంగా చర్చించిన తరువాత, ఈ వ్యవహారంలో మీడియాలో వస్తున్న వార్తలతో, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలతో ప్రజలలో నెలకొన్న అనుమానాలు నివృతి చేసేందుకు మీడియా ద్వారానే ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. దానిలో రెండు ప్రాంతాలలో జరిగిన లావాదేవీల గురించి, దానిపై ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి వివరించారు.
మియాపూర్ కేసు: మియాపూర్ లో ప్రభుత్వానికి చెందిన 810 ఎకరాలను ప్రయివేటు వ్యక్తులకు లిటిగేషన్ రైట్స్ కల్పిస్తూ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. వాస్తవానికి ఇది భూమి బదలాయింపు మాత్రమే. రిజిస్ట్రేషన్ కాదు. ఇది లిటిగేషన్ రైట్స్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ మాత్రమే. ఒకవేళ అది భూ బదలాయింపు రిజిస్ట్రేషనే అయితే.. మొత్తం భూమి విలువకు రిజిస్ట్రేషన్ ఛార్జి రూ.415 కోట్లు కట్టవలసి ఉంటుంది. కానీ సదరు వ్యక్తులు కేవలం రూ.60 లక్షలు మాత్రమే కట్టారు. నిజానికి ఏ ప్రాతిపదికలేకుండా ఆ మొత్తాన్ని కట్టారు. భూమిని స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే భూబదలాయింపు రిజిస్ట్రేషన్ బుక్: 1 లో నమోదు చేయాలి. కానీ ఇక్కడ చరాస్తి రిజిస్ట్రేషన్ చేసే బుక్:4 లో రిజిష్టర్ చేశారు. కనుక ఈ రిజిస్ట్రేషన్‌కు ఏమాత్రం విలువలేదు. అది ఎక్కడా చెల్లుబాటు కాదు. ఎప్పుడో రద్దయిన జాగీర్ భూములపై హక్కులు సంపాదించడానికి కొందరు వ్యక్తులు కోర్టులో కేసులు వేశారు.
సివిల్ కోర్టుల నుంచి హైకోర్టు వరకు ఎక్కడా వారి వాదన నెగ్గలేదు. దీంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసులో వాదనకు బలం చేకూరడానికి ఈ హక్కు పత్రాలు సంపాదించడానికి వీలుగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారిపైన, ఇతర బాధ్యులపైనా చర్యలు తీసుకొంది. రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేసింది. కాబట్టి మియాపూర్ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా నష్టం కలగలేదు...ఒక్క గజం స్థలం కూడా ఎవరి ఆధీనంలోకి పోలేదు. కోర్టు కేసుల్లో కూడా ప్రయివేటు వ్యక్తులకు బలం చేకూరే అవకాశం లేదు. ఇది ప్రభుత్వ భూమి అని నోటిఫై చేస్తూ ఈ వివరాలను ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లకు పంపింది. అది తెలిసి కూడా సబ్ రిజిస్ట్రార్ ఈ భూములను రిజిష్టర్ చేసినట్లు తేలింది. పూర్తిగా సబ్ రిజిష్ట్రార్ చేసిన తప్పుగానే ఇది కనిపిస్తున్నది.
బాలానగర్ కేసు: ఇది కూడా మియాపూర్ కేసులాగే సాగింది. ఇక్కడ కూడా భూబదలాయింపు రిజిస్ట్రేషన్ జరగలేదు. భూమిపై లిటిగేషన్ హక్కులకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగింది. భూమి విలువ ప్రకారం కాకుండా, ఎంతో కొంత ఫీజు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సబ్ రిజిస్ట్రార్ కేవలం రూ.8 లక్షలు తీసుకుని భూములను రిజిస్ట్రేషన్ చేశారు. ఇది కూడా బుక్ 1 (స్థిరాస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్)లో కాకుండా బుక్ 4(చరాస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్)లో చేశారు. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో మియాపూర్, మరియు 7 గ్రామాలు అని పేర్కొన్నారు తప్ప ఆ గ్రామాల పేర్లు రాయలేదు. ఎన్ని ఎకరాలో రాయలేదు. పైగా ఇవి కూడా ప్రభుత్వ భూములే కాబట్టి, ఈ రిజిస్ట్రేషన్ కూడా చెల్లదు. ఇక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి నష్టం జరగలేదు...ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదు. విషయం తెలిసిన వెంటనే ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకున్నది. ఈ రెండు ప్రాంతాల్లోనే కాకుండా, మిగతా చోట్ల జరిగిన వ్యవహారంపై కూడా పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.