ఎస్.ఐ. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

June 14, 2017


img

 సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్.ఐ. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో ఊహించని కొత్త ట్విస్ట్ ఒకటి బయటపడింది. హైదరాబాద్ ఫిలిం నగర్ లో గల ఆర్.జె.స్టూడియోలో బ్యూటిషియన్ గా పనిచేస్తున్న శిరీష అనే ఆమెతో ప్రభాకర్ రెడ్డికి సంబంధం ఉందని, కొన్ని రోజుల క్రితమే ఆమె కుకునూరుపల్లికి వచ్చి ఆయన ఇంటిలోనే ఒకరోజు బస చేసిందనే కొత్త విషయం ప్రాధమిక దర్యాప్తులో తెలిసినట్లు పోలీస్ అధికారులు చెప్పారు. ఒక స్థానిక పోలీస్ అధికారి కూడా అందుకు ప్రత్యక్ష సాక్షి అని దర్యాప్తులో తేలింది.

ఆమె హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయిన తరువాత ప్రభాకర్ రెడ్డి మొన్న సోమవారం రాత్రి ఆర్.జె.స్టూడియో యజమాని వల్లభనేని రాజీవ్ సమక్షంలోనే గొడవపడ్డారని, దానితో తీవ్ర మనస్తాపం చెందిన శిరీష ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కేసు తన మెడకు చుట్టుకొంటుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకొన్నాడని ప్రాధమిక విచారణలో తేలినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రభాకర్ రెడ్డి సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. దానిలో కాల్ రికార్డ్స్ ఆధారంగా నిజానిజాలు కనుగొంటామని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డిసిపి వెంకటేశ్వరులు మీడియాకు చెప్పారు.   

పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలిన ఈ విషయం నిజమయ్యుంటే ఈ కేసులో ఇది ఊహించని మలుపే. కానీ పై అధికారుల వేధింపుల కారణంగానే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొని ఉంటే, దానిని కప్పి పుచ్చేందుకే పోలీసులు ఈ కట్టుకధను సృష్టించి ఉంటే, దాని వలన పోలీస్ శాఖే చివరికి నష్టపోతుంది. ఎందుకంటే గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో రామకృష్ణా రెడ్డి అనే ఎస్ఐ కూడా ఇలాగే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు. ఒకవేళ ప్రభాకర్ రెడ్డి శిరీష కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటే మరి రామకృష్ణా రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నట్లు? కనుక ఒకవేళ ఉన్నతాధికారుల వేధించడం నిజమైతే రేపు మరొక ఎస్ఐ వచ్చినా అతను లేదా ఆమెకు ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది కనుక అందుకు బాద్యులపై చర్యలు తీసుకోవడమే సరైన పరిష్కారం.      



Related Post