ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు ఒకేసారి మూడు పెద్ద సమస్యలు తలకు చుట్టుకొన్నాయి. 1. విశాఖలో భూకుంభకోణాలు, 2. ప్రైవేట్ ట్రావెల్స్ కుంభకోణం, 3.వీటి కారణంగా ఎంపిలు, మంత్రుల మధ్య మొదలైన యుద్ధాలు.
విశాఖ భూకుంభకోణంపై సిట్ దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి ఈ సమస్యను సిట్ నివేదిక వచ్చే వరకు తాత్కాలికంగా పక్కన పెట్టవచ్చనుకొంటే మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మద్య యుద్ధం మొదలైంది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, అధికారులు కలిసి విశాఖలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే విమర్శించారు. విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావు ఆ విమర్శలు తనను ఉద్దేశ్యించి చేసినవేనని భావించి ముఖ్యమంత్రికి ఈరోజు ఒక లేఖ వ్రాశారు.
అయ్యన్న చేస్తున్న నిరాధారమైన ఆరోపణల వలన పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ట మంట గలుస్తున్నాయని, వాటి కారణంగానే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించగలుగుతున్నాయని లేఖలో వ్రాశారు. అయ్యన్న చేస్తున్న ఈ విమర్శల వలన ప్రభుత్వంపై ప్రజలలో కూడా అనుమానాలు కలిగే ప్రమాదం ఉందని వ్రాశారు. ఆయన వలన పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని, కనుక ఈ వ్యవహారంపై తక్షణం సిబిఐ లేదా రిటైర్డ్ జడ్జి చేత దర్యాప్తు జరిపించాలని గంటా తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.
ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వ్యవహారంలో తెదేపా ఎంపిలు కేశినేని నానికి, దివాకర్ రెడ్డికి మద్య మరో యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై దివాకర్ ట్రావెల్స్ అధినేత జెసి దివాకర్ రెడ్డి ఇంకా స్పందించలేదు. బహుశః నేడోరేపో స్పందించడం ఖాయం. ఈవిధంగా ఒకపక్క ప్రభుత్వంపై, అధికార పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలతో మరోపక్క పార్టీలో నేతల సిగపట్లతో చంద్రబాబు తలపట్టుకొన్నారు. గంటా లేఖతో ఈ యుద్దాలు పతాకస్థాయికి చేరినట్లే కనబడుతున్నాయి కనుక ఇప్పుడు బంతి బాబు కోర్టులో ఉంది. ఏమి చేస్తారో చూడాలి.