ఇదేమిటి గౌడ్?

June 14, 2017


img

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంచుమించు ఒకేసారి బయటపడిన ప్రైవేట్ ట్రావెల్స్ కుంభకోణాలు రెండు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సులు రెండు రాష్ట్రాలతో తిరుగుతుండటంతో దీనిపై రెండు రాష్ట్రాల మద్య వివాదానికి అవకాశం ఏర్పడింది.

దీనిపై తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, “ఇక నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్టర్ అయిన వాహనాలను తెలంగాణాలో కూడా తిరగనీయం. ఏపికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు ఒక పెద్ద మాఫియాగా తయారయ్యాయి. ఇకపై ఏపి నుంచి రాష్ట్రంలోకి వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కూడా అడ్డుకొంటాము. రెండు రాష్ట్రాలలో సింగిల్ పర్మిట్ పన్ను చెల్లింపు విషయంలో మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఏపి సర్కార్ పట్టించుకోవడం లేదు. ఇదేవిధంగా వ్యవహరిస్తే ఏపి నుంచి రాష్ట్రంలోకి వచ్చే లారీలను కూడా అడ్డుకొంటాము. దీనిపై మరో మూడు నాలుగు రోజులలో కార్యాచరణ ప్రకటిస్తాము. ఏపి నుంచి ఎన్ని బస్సులు తెలంగాణాలోకి ప్రవేశిస్తున్నాయో అన్నే బస్సులు ఏపికి నడపాలని మేము ప్రభుత్వాన్ని కోరాము,” అని అన్నారు.  

అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ల వ్యవహారం సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు కానీ రెండు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులకు, అధికారులకు తెలియదనుకోలేము. కానీ అందరూ ఇప్పుడే ఆ విషయం తెలుసుకొన్నట్లు మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడానికే అని చెప్పకతప్పదు.

ఇక తెరాస అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏపి నుంచి తెలంగాణాలోకి ప్రవేశించే వాహనాలకు ప్రవేశపన్ను వసూలు చేయాలని నిర్ణయించినప్పుడు, ఏపి ప్రభుత్వంతో సహా రెండు రాష్ట్రాలలో వాహన యజమానులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దాని వలన తాము చాలా నష్టపోతామని వేడుకొన్నా తెరాస సర్కార్ పట్టించుకోలేదు. అప్పటి నుంచే తెలంగాణా నుంచి ఏపిలోకి ప్రవేశించే వాహనాలపై ఏపి సర్కార్ కూడా ప్రవేశపన్ను వసూలు చేయడం మొదలుపెట్టింది.

అయితే తెరాస సర్కార్ అనుకొన్నది ఒకటైతే జరిగింది మరొకటి. ప్రవేశపన్ను ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూర్చుకోవచ్చని భావించింది. కానీ తెరాస సర్కార్ కంటే ఏపి సర్కార్ కే దీని వలన ఎక్కువ ఆదాయం సమకూరుతోంది. పైగా తెలంగాణా వాహన యజమానులకు ఇది అదనపు భారంగా మారింది. ఈ కారణంగా మళ్ళీ సింగిల్ పర్మిట్ విధానాన్నే అమలుచేయాలని తెరాస సర్కార్ విజ్ఞప్తి చేస్తోంది. కానీ, తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఏపి సర్కార్ తెరాస సర్కార్ పుణ్యమాని అదనంగా వస్తున్న ఈ ఆదాయాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. అది సహజం కూడా. అప్పుడు డబుల్ ఎంట్రీ టాక్స్ కావాలన్న తెరాస సర్కార్ ఇప్పుడు వద్దంటోంది. అప్పుడు వద్దన్న ఏపి సర్కార్ ఇప్పుడు కావాలంటోంది.

బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఏపి నుంచి వచ్చే బస్సులు, లారీలను తెలంగాణాలోకి అనుమతించమని చెప్పడం చాలా తప్పని చెప్పక తప్పదు ఎందుకంటే ఏపి, తెలంగాణా రాష్ట్రాలు శత్రుదేశాలు కావు. ఒకే దేశంలో నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు. 


Related Post