అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏపిలో తిప్పుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఏపి సర్కార్ బ్రేక్స్ వేయాలని నిర్ణయించడంతో నేటి అర్ధరాత్రి నుంచి ఆ బస్సులను నిలిపివేసి కేసులు నమోదు చేసేందుకు ఏపి రాష్ట్ర రవాణాశాఖ అధికారులు సిద్దం అవుతున్నారు. ఈ విషయం ముందే పసిగట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఈరోజు తమ బస్సులను బయటకు తీయకపోవడంతో ఏపి నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే అనేక బస్సులు నిలిచిపోయాయి.
తెదేపా ఎంపిలు కేశినేని నాని, జేసి దివాకర్ రెడ్డి ఇద్దరూ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బిజినెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. వారిలో కేశినేని నానికి ఏపి రవాణా శాఖ అధికారులతో కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. ఆ సందర్భంగా ఆయన వారితో దురుసుగా వ్యవహరిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించడంతో వారికి క్షమాపణలు చెప్పారు. ఆ కోపంతో తన కేశినేని ట్రావెల్స్ ను మూసివేశారు.
తనకు నష్టం కలిగించినవారిని దెబ్బ తీయడానికే ఆయన అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్స్ వ్యవహారం బయటపెట్టారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన పిర్యాదుపై మొదట ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన మళ్ళీ నిన్న రవాణాశాఖ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పుడు రంగంలో దిగిన మంత్రి అచ్చెం నాయుడు వారిని వెనకేసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ కేశినేని నాని ఆయనపై కూడా ఫైర్ అవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకొని వేరే రాష్ట్రాల రిజిస్ట్రేషన్, పర్మిట్స్ తో రాష్ట్రంలో తిరుగుతున్న బస్సులను నిలిపివేసి వాటి యజమానులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
దీని వలన ఒకవేళ జేసి దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ సంస్థకు నష్టం కలిగినట్లయితే, ఇప్పుడు ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల మద్య జరుగుతున్న ఈ యుద్దాల వలన తెదేపా ప్రభుత్వానికి తీరని అప్రదిష్ట, విమర్శలు, ఊహించని తలనొప్పులు భరించకతప్పదు.
ఎంపిలుగా ఉన్నవారే ఈవిధంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతుంటే, ప్రభుత్వం చూసి చూడనట్లు ఊరుకొందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కనుక చివరకు ఈ యుద్ధం ఏవిధంగా ముగుస్తుందో..దీనిలో విజేతలు ఎవరో..పరాజితులు ఎవరో..చూడాల్సిందే.