కాంగ్రెస్ చెప్పిందే కోదండరామ్ వల్లిస్తున్నారు

June 13, 2017


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మొదట్లో తెరాస సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో సరిపెట్టేవారు కానీ ఇప్పుడు నేరుగానే విమర్శిస్తున్నారు. కనుక తెరాస కూడా ఆయనతో నేరుగానే యుద్ధం చేస్తోంది. తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, తెరాస ఎంపి బాల్కా సుమన్ ఆయనపై నిప్పులు చెరిగారు. 

కాంగ్రెస్ నేతలు ఏమి మాట్లాడుతున్నారో ప్రొఫెసర్ కోదండరామ్ కూడా సరిగ్గా అవే మాటలు మాట్లాడుతూ ప్రతినిధిలాగ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎంతసేపు ప్రభుత్వంపై బురద జల్లడమే తప్ప ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు ఎందుకు చేయరని ప్రశ్నించారు. గ్రూప్-2 సిలబస్ కమిటీలో సభ్యుడుగ ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ ఆవిషయంలో ప్రభుత్వానికి ఎందుకు ఎటువంటి సలహాలు ఇవ్వలేదని ఎంపి బాల్క సుమన్ ప్రశ్నించారు. ఆయన ఒక జెఎసి నేతలాగ కాకుండా ఒక ప్రతిపక్ష నేతలాగ మాట్లాడుతూ రాజకీయాలు చేస్తున్నారని సుమన్ విమర్శించారు. ఆయన ఇప్పటికైనా తన తీరు మార్చుకొని ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు చేస్తే ప్రభుత్వం వాటిని తప్పకుండా పరిగణనలోకి తీసుకొంటుందని హితవు పలికారు.

సుమారు పదేళ్ళపాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అనేకానేక కుంభకోణాలకు పాల్పడిందని అటువంటి పార్టీతో కలిసి పనిచేయడానికి ప్రొఫెసర్ కోదండరామ్ సిగ్గుపడాలని కర్నే ప్రభాకర్ అన్నారు. మూడేళ్ళుగా తెలంగాణా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న తమ ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రొఫెసర్ కోదండరామ్ ఎందుకు ప్రయత్నిస్తున్నారో తమకు అర్ధం కావడం లేదని కర్నే ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.



Related Post