ఏపి నుంచి తెలంగాణాకు సరఫరా అవుతున్న 400 మెగావాట్స్ విద్యుత్ ను శనివారం అర్ధరాత్రి నుంచి ఏపి జెన్ కో నిలిపివేసింది. తెలంగాణా జెన్ కో తమకు రూ.3,188 కోట్లు బకాయిలు చెల్లించకపోవడం వలననే విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్లు ప్రకటించింది. దీనిపై తాము తెలంగాణా జెన్ కోకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఏపి జెన్ కో ఉన్నతాధికారులు తెలిపారు.
అయితే ఏపి జెన్ కోయే తమకు రూ.1,676.46 కోట్లు బకాయిలు చెల్లించవలసి ఉందని, తక్షణం అది చెల్లించకపోతే తాము కూడా ఏపికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలంగాణా జెన్ కో బదులిచ్చింది.
ఏపి జెన్ కో సింగరేణికి సుమారు రూ.1,300 కోట్లు చెల్లించవలసి ఉంది. ఆ విషయం ఏపి జెన్ కో అంగీకరించింది కూడా. కానీ ఆ మొత్తాన్ని తెలంగాణా జెన్ కో తమకు చెల్లించవలసిన బకాయిలలో తగ్గించుకోమని కోరింది. అందుకు అంగీకరించని సింగరేణి సంస్థ నిన్నటి నుంచి ఏపిలోని ధర్మల్ విధ్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.
ఏపి జెన్ కో తెలంగాణాకు విద్యుత్ సరఫరా నిలిపివేసింది గనుక తెలంగాణా జెన్ కో కూడా నేడో రేపో ఏపికి విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో ఏపి, తెలంగాణా రాష్ట్రాల మద్య మళ్ళీ మరో యుద్ధం మొదలైనట్లే భావించవచ్చు.
విద్యుత్, బొగ్గు సరఫరా వంటి నిరంతరంగాసాగే వ్యవహారాలను చూసుకొనేందుకు రెండు రాష్ట్రాలలో చాలా పెద్ద యంత్రాంగమే ఉంటుంది. కనుక ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్నీ సజావుగా సాగిపోతుంటాయి. కానీ ఇది కూడా ఒక సమస్యగా మారడానికి ప్రధాన కారణం విభజన సమస్యలే అని చెప్పక తప్పదు.
హైకోర్టు విభజన, హైదరాబాద్ సచివాలయం, శాసనసభ, మండలి భవనాల అప్పగింత మొదలైన విభజన సమస్యలను ఏపి సర్కార్ షెడ్యూల్ :10 సంస్థల ఆస్తుల పంపకంతో ముడిపెట్టిన సంగతి తెలిసిందే. రెండు ప్రభుత్వాలు ఆ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా, పంతాలు, పట్టింపులకుపోతూ ఈవిధంగా ఒక సమస్యను మరొకదానితో ముడిపెట్టుకొంటూ సమస్యలను ఇంకా జటిలం చేసుకోవడం శోచనీయం.
తెదేపా, తెరాసలు తమ మద్య ఉన్న రాజకీయ విభేదాలను ప్రభుత్వ వ్యవస్థలకు కూడా పాకించడం వలన రెండు ప్రభుత్వ రంగసంస్థల మద్య నిరంతరంగా చాలా సాఫీగా సాగిపోవలసిన ఇటువంటి వ్యవహారాలు కూడా పెను సమస్యగా మారడం చాలా శోచనీయం. చిన్న పిల్లలాగ కీచులాడుకొని విద్యుత్, బొగ్గు సరఫరాలు నిలిపివేసుకొంటే రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయనే సంగతి గ్రహించకపోవడం ఇంకా విచారకరం.