ఆ సిఎం డ్రామా అలా ముగిసింది

June 12, 2017


img

మధ్యప్రదేశ్ లో పోలీసులు కాల్పులలో ఆరుగురు రైతులు మరణించడంతో యావత్ దేశప్రజల దృష్టిలో పడిన ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్రంలో పరిస్థితులను అదుపుచేసే  ప్రయత్నం చేయకుండా నిరాహారదీక్ష చేయడంతో ఇంకా నవ్వులపాలయ్యారు. తీవ్ర విమర్శలు మూటగట్టుకొన్నారు.

రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఆయన వైఫల్యం అవడం వలన ఇరుగుపొరుగు భాజపా రాష్ట్రాలకు కూడా రైతుల ఆందోళనలు వ్యాపించడం మొదలవుతున్న సమయంలో ఆయన నిరాహార దీక్ష పేరుతో కాలక్షేపం చేస్తుండటం కేంద్ర ప్రభుత్వానికి కూడా కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది కనుక బహుశః ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు మొట్టికాయలు వేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. బహుశః అందుకేనేమో శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం మొదలుపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఆదివారం విరమించారు. రాష్ట్రంలో మళ్ళీ ప్రశాంత వాతావరణం ఏర్పడినందున దీక్షను విరమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కైలాస్ జోషి కొబ్బరి నీళ్ళు ఇచ్చి ఆయన చేత దీక్ష విరమింపజేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు వాటిని ఈవిధంగా నిరాహార దీక్ష చేయడం ద్వారా పరిష్కరించగలిగితే ఇక పోలీసులు అవసరమే ఉండదు కదా? ఇంతకీ అయన రైతుల సమస్యలు ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పనే లేదు. కనుక వారు తమ ఉద్యమాలను తీవ్రతరం చేసినా చేయవచ్చు. కనుక ఈసారి వారి సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించవలసి ఉంటుంది.


Related Post