మొన్న ఇరాన్ పార్లమెంటుపై దాడి చేసిన ఐసిస్ ఉగ్రవాదులు తమ తదుపరి లక్ష్యం సౌదీ అరేబియా అని ప్రకటించారు. తాము ఒక ప్రాంతంపైనో ప్రజలపైనో పట్టుకోసం పోరాడటం లేదని, ఇస్లాం మతం కోసమే పోరాడుతున్నామని ప్రకటించారు. “ఇరాన్ లో జిహాదీ జరుపడానికి అల్లా అనుమతి లభించింది. అందుకే అక్కడ దాడి చేశాము. తరువాత సౌదీ అరేబియా వంతు వచ్చింది. త్వరలోనే సౌదీలో కూడా బారీగా దాడులు చేస్తాము. ఇస్లాం మతం కోసం మేము చేస్తున్న పోరాటంలో పాల్గొనేందుకు ముస్లిం సోదరులదరినీ మా వెంట రమ్మని కోరుతున్నాము,” అని ఐసిస్ ఉగ్రవాదులు ఒక వీడియో సందేశం ద్వారా సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రపంచంలో ముస్లింలందరికీ పరమపవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కా సౌదీ అరేబియాలోనే ఉంది. కనుక ఆ దేశంలో ప్రజలు, ప్రభుత్వం అందరూ కూడా ఇస్లాం మతాచారాలను చాలా ఖచ్చితంగా పాటిస్తారు. గల్ఫ్ లో మిగిలిన అన్ని దేశాలలో ఇతర మతాలను, వారి సంస్కృతీ సంప్రదాయాలను ఆయా ప్రభుత్వాలు అనుమతించినప్పటికీ, సౌదీ అరేబియాలో మాత్రమే కేవలం ఇస్లాం మతం మాత్రమే కనబడుతుంది.
అటువంటి దేశంమీద కూడా ఐసిస్ ఉగ్రవాదులు ఎందుకు కన్నెర్ర చేశారు? అంటే వారికి ఆర్ధిక సహాయం అందిస్తోందనే కారణంతో సౌదీతో సహా గల్ఫ్ దేశాలన్నీ ఖతర్ తో దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసుకొన్నందున కావచ్చు. గల్ఫ్ దేశాలన్నీ ఖతర్ దేశంతో తమ దేశసరిహద్దులను మూసివేసి, దానితో జల,వాయు రవాణా వ్యవస్థలను కూడా నిలిపివేశాయి. ఈ కారణంగా ఖతర్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. అది ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ఒకవేళ గల్ఫ్ దేశాల ఆరోపణలు నిజమయితే, ఖతర్ తనపై పడిన ఆ ఉగ్రవాద ముద్ర చెరిపివేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కనుక అది ఐసిస్ ఉగ్రవాదులకు నిధులు అందించడానికి వెనుకాడవచ్చు. అదే జరిగితే ఐసిస్ తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఐసిస్ ఉగ్రవాదులు బహుశః ఇది మనసులో పెట్టుకొనే సౌదీపై కక్ష కట్టినట్లున్నారు. కానీ ఇస్లాం మతానికి నిలయమైన సౌదీపై దాడులు చేస్తే ఇక ఐసిస్ ఉగ్రవాదుల పతనం మొదలైనట్లే భావించవచ్చు.