గత ప్రభుత్వాలను నిందిస్తే...

June 03, 2017


img

వికారాబాద్ జిల్లాలో పరిగిలో గొల్ల కురుమల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గత కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాలపై, వాటి నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీల పాలన దొంగ పాలన అని విమర్శించారు. ఉత్తం కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీలో అందరూ గెడ్డాలు పెంచుకొన్నా రాష్ట్రంలో ఆ పార్టీ ఎన్నటికీ అధికారంలోకి రాలేదని అన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఓ అబద్దాలకోరని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ అని విమర్శించారు. కేవలం తమ ప్రభుత్వం మాత్రమే తెలంగాణా ప్రజల బాగోగులు చూసుకొంటోందని, ఇంతకాలం నిరాదారణకు గురైన రాష్ట్రంలోని గొల్ల కురుములకు తమ 1.3 కోట్ల గొర్రెలను పంచిపెడుతోందని అన్నారు.  

మంత్రులలో తలసానికి కాస్త నోటి జోరు ఎక్కువనే జనాభిప్రాయం నిజమేనని నిరూపిస్తున్నట్లు ఆయన మాట్లాడారు. మూడేళ్ళ తరువాత కూడా ఇంకా గత ప్రభుత్వాలను నిందిస్తూ ప్రజలను ఆకట్టుకోవాలనుకోవడం రాజకీయ దివాళాకోరుతనంగానే భావించవలసి ఉంటుంది. గమ్మతైన విషయం ఏమిటంటే గత ప్రభుత్వాలను నిందిస్తున్న తలసాని నేటికీ తెదేపా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. తెదేపా ద్వారా సంపాదించుకొన్న ఆ పదవిని వదులుకోవడానికి నేటికీ ఇష్టపడటం లేదు. ఒకపక్క తెదేపా ఎమ్మెల్యేగా కొనసాగుతూ తెరాస సర్కార్ లో మంత్రిగా చేయడమే చాలా అనైతికం.

అదీగాక గత ప్రభుత్వాలను నిందించే తెరాస నేతలేవరైనా తమను తామే తిట్టుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. ఎందుకంటే తెరాసలో అత్యధికులు కాంగ్రెస్, తెదేపాల నుంచి వచ్చినవారే. ఇక ఇతరులను వేలెత్తి చూపుతున్న తలసానిని మియాపూర్ భూకుంభకోణంలో పాత్ర ఉందని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కనుక రాజకీయాలలో ఉన్నవారు తమ ప్రత్యర్ధులపై ఎంత బురద జల్లితే అంతా తమపై కూడా పడుతుందని గ్రహిస్తే మంచిది. 


Related Post