రైతులపై కాల్పులు జరిపింది పోలీసులు కాదుట!

June 07, 2017


img

మధ్యప్రదేశ్ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు నిన్న కాల్పులు జరుపగా ఐదుగురు రైతులు మరణించడంతో దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా సర్కార్ పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి. ఈ సంఘటనతో ఒకవైపు రైతులు, మరోవైపు ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ సర్కార్ ఈ సమస్య నుంచి బయటపడటానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. 

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం గత అక్టోబర్ వరకు గల పంట రుణాలను అన్నిటినీ మాఫీ చేసింది. అయినా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొడుతూ కుట్రలు పన్నుతోంది. నిన్న రైతులపై కాల్పులు జరిపినవారు పోలీసులు కారు. కొన్ని సంఘవిద్రోహక శక్తులు ఈ దారుణానికి ఒడిగట్టాయి. రైతుల ఆందోళనను మేము అర్ధం చేసుకోగలము. తప్పకుండా వారి సమస్యలను పరిష్కరిస్తాము. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తాము,” అని చెప్పారు. 

రైతులపై పోలీసులు కాల్పులు జరుపడం, దానిలో ఐదుగురు రైతులు మరణించడంతో చౌహాన్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు పట్టపగలు బహిరంగంగా మీడియా సమక్షంలో జరిగిన ఈ ఘటనను వక్రీకరించే ప్రయత్నం చేయడం వలన రైతులు ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో భాజపా ప్రభుత్వం నడుస్తోంది కనుక ఇది ఆ రాష్ట్రానికే పరిమితం కాకుండా, దాని సెగలు మోడీ సర్కార్ ను కూడా తాకుతున్నాయి. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అప్పుడే భాజపాను, ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి. కనుక శివరాజ్ సింగ్ చౌహాన్ పై ఇంకా ఒత్తిడి పెరిగిపోతోంది. తక్షణం ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే ఆయన పదవికి గండం ఏర్పడవచ్చు.  


Related Post