అభద్రతాభావంతోనే సర్వేలు: మల్లు

June 06, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సర్వే ఫలితాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు శాసనసభ స్థానాలను మాత్రమే గెలుచుకొంటుందని కేసీఆర్ తేల్చి చెప్పారు. వాటిలో రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గం ఒకటి. 

ఇదే విషయమై ఆయన స్పందిస్తూ, “నిజానికి ఒక్క మధిరలోనే కాదు.. రాష్ట్రమంతటా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలత, తెరాస పట్ల వ్యతిరేకత కనబడుతోంది. నా నియోజక వర్గ అభివృద్ధికి నేను చేస్తున్న కృషిని ఇక్కడి ప్రజలు ఎప్పుడూ గుర్తించి నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. ఈ సంగతి కేసీఆర్ కూడా గ్రహించినట్లే ఉన్నారు. కానీ తెరాస ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో కూడా అభివృద్ధి జరుగకపోవడం వలన ప్రజలు తెరాస సర్కార్ పై చాలా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను ఎల్లకాలం మభ్యపుచ్చాలనుకోవడమే అందుకు కారణం. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే సర్వేలు చేయించుకొంటూ వాటితో తెరాస నేతలను, ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ విధంగా సర్వేలు చేయించుకోవడం ఆయనలో గూడుకట్టుకొనున్న అభద్రతాభావానికి అద్దం పడుతున్నాయి. ఈ మూడేళ్ళలో ఆయన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదు. కనుక పాత వాటిపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే ఎప్పటికప్పుడు కొత్త హామీలు, పధకాలు ప్రకటిస్తుంటారు. కానీ వేటినీ అమలుచేయరు. అదే కేసీఆర్ ప్రత్యేకత. 

మేము అభివృద్ధి పనులు అడ్డుపడుతున్నామని అందుకే ప్రజలు మాపైనే ఆగ్రహంగా ఉన్నారని తెరాస ప్రచారం చేస్తోంది. నిజానికి మేము ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే వారి తరపున ప్రభుత్వంతో పోరాడుతున్నాము తప్ప రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి కాదు. ఈ సంగతి ప్రజలకు కూడా తెలుసని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలుసు. అందుకే మాపై తెరాస నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలు మావైపే ఉన్నారని వచ్చే ఎన్నికలలో తేలిపోతుంది. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. అది ప్రజాస్వామ్య లక్షణం. అదే మాకు వచ్చే ఎన్నికలలో కలిసిరాబోతోంది,” అన్నారు మల్లు భట్టి విక్రమార్క. 


Related Post