రాహుల్ గాంధీ సభకు వచ్చిన అపూర్వ స్పందన చూసి తెరాస నేతలలో కంగారు మొదలైందని అందుకే మంత్రి హరీష్ రావు తమ పార్టీ నేతలను, కార్యకర్తలను తెరాసలో చేరమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. అందుకు తాజా ఉదాహరణగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అమీన్ పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తెరాసలో చేరడానికి నిరాకరించడంతో ఆయనను సర్పంచ్ పదవిలో నుంచి తొలగించారని అన్నారు. అయితే ఇటువంటి బెదిరింపులకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ భయపడనవసరం లేదని వారికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని జగ్గారెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ “నన్ను తెరాసలో చేరమని మంత్రి హరీష్ రావు కబురు పంపించారు. కానీ అందుకు నేను అంగీకరించలేదు. వెంటనే నన్ను సర్పంచ్ పదవిలో నుంచి తొలగించారు,” అని చెప్పారు.
జగ్గారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ చెపుతున్న మాటలు వాస్తవం అయితే రాహుల్ సభను చూసి తెరాస ఉలిక్కి పడిందని భావించకతప్పదు. ఫిరాయింపులు ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బ తీసినా మళ్ళీ ఇంత త్వరగా కోలుకొంటుందని ఊహించని తెరాస ఇప్పుడు మళ్ళీ మరోసారి రంగంలోకి దిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. ఈసారి కాంగ్రెస్ లో నుంచి నేతలు, కార్యకర్తలు తెరాసలోకి వలసలు వెళ్ళిపోయినట్లయితే ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోవచ్చు. కనుక కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండక తప్పదు.
తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి రాష్ట్ర ప్రజలందరూ తమనే ఆశీర్వదిస్తున్నారని చెప్పుకొంటున్న తెరాస ఇతర పార్టీలను ఈవిధంగా నిర్వీర్యం చేయడం అభద్రతాభావాన్ని సూచిస్తోంది. ఆ అభద్రతాభావమే దానిని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంచుతోందని చెప్పవచ్చు. అదేవిధంగా తెరాస యొక్క ఆ అభద్రతాభావమే కాంగ్రెస్, భాజపా, వామపక్షాలకు అధికారంలోకి రాగలమనే ఆశ కల్పిస్తోందని చెప్పవచ్చు.