కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం గుంటూరులో ప్రత్యేక హోదా కోరుతూ నిర్వహించిన బారీ బహిరంగసభతో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు చాలా ఆందోళన చెందుతున్నట్లున్నారు. రాహుల్ గాంధీ తనతో వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలను వెంటేసుకొని రావడం, ఆ సభకు బారీగా జనాలు తరలిరావడం, మోడీని చూసి చంద్రబాబు ఎందుకో భయపడుతున్నారని రాహుల్ సందేహం వ్యక్తం చేయడం అన్నీ ఆయనలో ఆందోళన కలిగించినట్లు ఆయన మాటలే చెపుతున్నాయి. ఈరోజు ఆయన తన పార్టీ నేతలతో మాట్లాడుతూ “ఒకప్పుడు డిపాజిట్లు రాని పరిస్థితి నుంచి నేడు బారీ బహిరంగ సభ నిర్వహించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. మనం అప్రమత్తంగా ఉండాలని ఇది సూచిస్తోంది,” అని అన్నారు.
ఇక మీడియాతో మాట్లాడుతూ, “నిన్న ఒక కాంగ్రెస్ నేత రాష్ట్రానికి వచ్చాడు. నేను ప్రధాని నరేంద్ర మోడీకి భయపడుతున్నానని ఏవేవో అన్నారు. దేశంలో అందరికంటే సీనియర్ నేతను నేనే. నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాను. ఏపికి బారీగా నిధులు అవసరం ఉంది. అందుకే కేంద్రంతో సఖ్యతగా ఉంటూ గౌరవంగా వ్యవహరిస్తున్నాను. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఏడాది చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు విడుదల చేసి తీరుతాము,” అని అన్నారు.
ఒకప్పుడు రాహుల్ పర్యటనలను చంద్రబాబు నాయుడు పట్టించుకొనేవారే కాదు. ఆయన మంత్రులో ఎంపిల చేతో రాహుల్ విమర్శలని తిప్పి కొట్టించేవారు. కానీ ఇప్పుడు స్వయంగా సంజాయిషీలు చెప్పుకొంటున్నారు. ఇక తను ఎవరికీ భయపడను అని చెప్పుకొనే మాటల్లో ఎంత వాస్తవం ఉందో అందరికీ తెలుసు. ఒకప్పుడు తెలంగాణాలో రాజకీయాలను శాశించిన చంద్రబాబు ఇప్పుడు ధైర్యంగా తెలంగాణాలో తిరగలేని పరిస్థితి నెలకొని ఉంది. కారణాలు అందరికీ తెలుసు. “అయినప్పటికీ నేను నిప్పు లాంటి మనిషిని..ఆరడుగుల బులెట్ వంటివాడిని..ఎవరికీ భయపడను” అని చెప్పుకొంటారు. అది చూసి ప్రజలు నవ్వుకొంటుంటారు.