ఏపిలో కాంగ్రెస్ నేతలు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని, వైకాపాను విమర్శించేవారు కాదు. వీలైతే అవకాశం చిక్కినపుడల్లా వైకాపాకు మద్దతుగా వ్యవహరిస్తుండేవారు. ఎందుకంటే ఏదో ఒక రోజున అయన తప్పకుండా తమ పార్టీతో జతకడతారనే చిన్న ఆశ వారిలో ఉండేది. ఆ కారణం చేతనే వారు ఇంతకాలం సంయమనం పాటించేరు. కానీ నిన్న గుంటూరులో జరిగిన కాంగ్రెస్ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డిని నేరుగా పేరు పెట్టి విమర్శించడం గమనార్హం.
“ప్రధాని నరేంద్ర మోడీ చూసి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఎందుకో భయపడుతున్నారు. అందుకే వారు ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు మొదలైనవాటి గురించి మోడీని గట్టిగా నిలదీసి అడగలేకపోతున్నారు. వారు మోడీని చూసి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు” అని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెదేపాతో పోరాడుతోంది కనుక రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడును విమర్శించడం సహజమే. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శించడమే విశేషం. కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీతో గంటసేపు ప్రత్యేక సమావేశం అయిన తరువాత, భాజపా-వైకాపాలు జత కట్టబోతున్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిపై తెదేపా నేతలు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. అవి నిజం అయ్యే సూచనలున్నాయని కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా నమ్ముతున్నందునే, ఇక వైకాపాతో దోస్తీపై ఆశలు వదిలేసుకొని రాహుల్ గాంధీ నేరుగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసినట్లు భావించవచ్చు. ఒకవేళ భాజపా తెదేపాతో కటీఫ్ చేసుకొని వైకాపాతో జత కడితే వచ్చే ఎన్నికలలో ఏపిలో తెదేపాకు వాటి నుంచి చాలా గట్టి సవాలు ఎదుర్కోవలసిరావచ్చు.