ఇక్కడ తెలంగాణా..అక్కడ ప్రత్యేక సెంటిమెంటు..

June 05, 2017


img

మొన్న సంగారెడ్డి కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నప్పుడు తెలంగాణా సెంటిమెంటును ప్రయోగించిన సంగతి తెలిసిందే. తెలంగాణా రాష్ట్రం ఇస్తే మీకు ఏమి ఒరిగిందని ప్రజలను ప్రశ్నించిన రాహుల్ గాంధీ, ఆదివారం గుంటూరులో జరిగిన కాంగ్రెస్ సభలో ఏపి ప్రజలపై ప్రత్యేక హోదా సెంటిమెంటు అస్త్రం ప్రయోగించారు. ఏపికి మేము ప్రత్యేక హోదా ఇస్తామన్నా తెదేపా, వైకాపా ఎందుకు వద్దంటున్నాయి? భాజపా ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించడం విశేషం. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉదారంగా సహాయసహకారాలు అందజేసినా, తెరాస, తెదేపా, వైకాపా, భాజపాలు కలిసి ఆ ఫలాలు ప్రజలకు చేరకుండా అడ్డుపడుతున్నాయని రాహుల్ గాంధీ చెపుతున్నట్లు భావించవచ్చు.

రాహుల్ గాంధీ ప్రయోగించిన ఈ రెండు సెంటిమెంట్లు ప్రజలకు బాగానే చేరుతాయని వేరే చెప్పనవసరం లేదు. అలాగే తెలంగాణాలో తెరాసను, ఏపిలో తెదేపాలను గురిచూసి కొట్టగలిగారు. వాటితో పాటే భాజపా, వైకాపాలను కూడా దెబ్బ తీసే ప్రయత్నాలు చేశారు. తెదేపా, తెరాస, భాజపాల తీవ్ర ప్రతిస్పందన గమనిస్తే రాహుల్ గాంధీ గురి తప్పలేదని అర్ధం అవుతోంది. ఈసారి రెండు రాష్ట్రాలలో రాహుల్ గాంధీ పర్యటనకు బారీగా జనాలు తరలిరావడం మరో విశేషం. రెండు చోట్ల రాహుల్ గాంధీ ఉత్తేజకరమైన ప్రసంగాలు, ఆయన సభలలో బారీ సంఖ్యలో జనాలు కనబడటం ఏపి, తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలకు ఏమైనా రాజకీయ ప్రయోజనం కలిగిస్తాయా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఈ సభలు కాంగ్రెస్ నేతలకు చాలా ఉత్సాహం కలిగించేవేనని చెప్పవచ్చు.   


Related Post