త్వరలో తెలంగాణా రాష్ట్రంలో వైకాపా క్రియాశీలంగా వ్యవహరించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యాలయం ‘లోటస్ పాండ్’ లో జాతీయ జెండా ఎగురవేసిన తరువాత (సాక్షి) మీడియాతో మాట్లాడుతూ తెరాస సర్కార్ మూడేళ్ళ పాలనలో కుంభకోణాలు తప్ప మరేమీ జరుగడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణా ఏర్పాటుకు ముఖ్య కారణాలైన నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేలకోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకైణా నీళ్ళు ఇవ్వగలిగారా? అని ప్రశ్నించారు.
అసలు కమీషన్లకు కక్కుర్తిపడే బారీ ప్రాజెక్టులు మొదలుపెట్టారు తప్ప వాటిద్వారా రైతులకు నీళ్ళు అందించాలనే ఉద్దేశ్యంతో కాదని అన్నారు. బంగారి తెలంగాణా సాధిస్తామని చెపుతూ వరుస కుంభకోణాలలో మునిగి తేలుతున్న తెరాస సర్కార్ ను గద్దెదించడానికి, నిజమైన బంగారి తెలంగాణా సాధించడానికి అందరూ మరోసారి పోరాటానికి సిద్దం కావాలని అన్నారు. త్వరలోనే తమ పార్టీ క్రియాశీలంగా వ్యవహరిస్తుందని గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నగర, రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా ఇంతవరకు నోరుమెదప కుండా లోటస్ పాండ్ కే పరిమితమైన వైకాపా ఇప్పుడు హటాత్తుగా తెరాస సర్కార్ పై విరుచుకుపడటం విచిత్రమే. పైగా త్వరలో క్రియాశీలంగా వ్యవహరిస్తామని చెప్పడం వింటే వాళ్ళను ఇంతకాలం క్రియాశీలంగా వ్యవహరించవద్దని ఎవరైనా ఆదేశించారా? అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో ఎప్పుడైనా..ఎక్కడైనా ఎన్నికలు వచ్చినప్పుడే స్వర్గీయ వైఎస్స్ఆర్ నామస్మరణతో వైకాపా ప్రజల మద్యకు వస్తుంటుంది. మిగిలిన సమయం అంతా లోటస్ పాండ్ కే పరిమితం అవుతుంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది కనుక మళ్ళీ ‘క్రియాశీలంగా’ వ్యవహరిస్తానని చెపుతోందేమో లోటస్ పాండ్ పార్టీ?