దేశంలో అంతమంది ముస్లింలు ఉన్నా...

June 03, 2017


img

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం ఎంతగా కట్టడి చేస్తోందో వివరించే ప్రయత్నంలో వివాదాస్పదమైన వ్యాఖ్య ఒకటి చేశారు. ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన దేశంలోకి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడకుండా గట్టిగా అడ్డుకొంటున్నాము. గత ఏడాది సెప్టెంబర్ లో సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన తరువాత సుమారు 45శాతం వరకు పాక్ నుంచి భారత్ లోకి ప్రవేశించే ఉగ్రవాదులు సంఖ్య తగ్గింది. కాశ్మీర్ లో పరిస్థితులు కూడా క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. త్వరలోనే పూర్తి నియంత్రణలోకి వస్తాయని భావిస్తున్నాము. ఈ మూడేళ్ళలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం 368మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాము. అదేవిధంగా 90 మంది ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ చేశాము. మన నిఘా వర్గాలు దేశంలో నుంచి ఉగ్రవాదుల సానుభూతిపరులను ఏరివేస్తున్నందున మన దేశంలో కోట్లమంది ముస్లిం జనాభా ఉన్నప్పటికీ ఐసిస్ ఉగ్రవాదులు ప్రవేశించే సాహసం చేయలేకపోతున్నారు,” అన్నారు. 

రాజ్ నాథ్ సింగ్ ఉగ్రవాదం అరికట్టడం గురించి చెపుతున్న మాటలపై ఎవరూ అభ్యంతరం చెప్పలేరు కానీ దేశంలో కోట్లమంది ముస్లిం జనాభా ఉన్నా కూడా ఐసిస్ ఉగ్రవాదులు దేశంలో కాలుపెట్టలేకపోతున్నారని చెప్పడం ముస్లింలు అందరూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తారన్నట్లున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముస్లింలందరినీ అనుమానిస్తున్నట్లుగానే హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. బహుశః నేడోరేపో ముస్లిం నేతలు దీనిపై తమ ఆక్షేపణలు తెలుపవచ్చు. 

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ మాటలు చెపుతున్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ జిల్లాలో ఖాజీ గుండ్ అనే ప్రాంతంలో పయనిస్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు జవాన్లను పొట్టనపెట్టుకొన్నారు. ఈ దాడిలో మరికొందరు జవాన్లు గాయపడినట్లు సమాచారం. ఇదివరకు ఉగ్రవాదులు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో దొంగచాటుగా బాంబులు పేల్చి పారిపోయేవారు. కానీ ఇప్పుడు ఆర్మీ వాహనలపైనే నేరుగా దాడులు చేస్తున్నారు. మరి ఉగ్రవాదులు వెనక్కు తగ్గినట్లా లేక పెరిగినట్లా?ఆయనే చెప్పాలి.    


Related Post