తెలంగాణా రాష్ట్రం దేశంలో రెండవ ధనిక రాష్ట్రమని, ఆర్ధికంగా దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకొంటున్నప్పుడు, రైతులను, విద్యార్ధులను, పేదలను ఎందుకు ఆదుకోవడంలేదని ప్రతిపక్షాలు తరచూ ప్రశ్నించడం అందరం వింటూనే ఉన్నాము. వారి ప్రశ్నకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
మా ప్రభుత్వం గత మూడేళ్ళుగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నందున 2016-17 ఆర్ధిక సం.లో మన రాష్ట్రం ఆదాయంలో 17.8 శాతం వృద్ధిరేటు సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ విషయం నేను చెపుతున్నది కాదు. స్వయంగా కాగ్ చెప్పింది. మనం సరైన దిశలో పయనిస్తున్నామని చెప్పడానికి ఇది బలమైన నిదర్శనం.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే మన ఆర్దికపరిస్థితి వేగంగా అభివృద్ధి చెందుతుందని నేను ఉద్యమ సమయంలోనే చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే ఈ అభివృద్ధి ఫలాలను అంటే పెరిగిన రాష్ట్ర ఆదాయంలో అత్యధిక శాతం పేదల కోసం సంక్షేమ పధకాలపైనే ఖర్చు చేస్తున్నాము. ప్రస్తుతం రూ.40,000 కోట్లు విలువగల 35 రకాల సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు చేస్తున్నాము. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, హాస్టల్స్ లో చదువుకొంటున్న పేద విద్యార్ధులకు సన్నబియ్యంతో అన్నం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వేర్వేరుగా గురుకుల పాఠశాలల ఏర్పాటు, అమ్మఒడి పేరిట గర్భిణి స్త్రీలకు రూ.12,000 ఆర్ధిక సహాయం, వారికి రూ.3,000 విలువగల కేసీఆర్ కిట్స్ పంపిణీ, వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారికి పెన్షన్లు, ఈ ఆదివారం నుంచి రాష్ట్రంలో ఒంటరి మహిళలకు నెలకు రూ.1,000 పెన్షన్లు..ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం చాలా బారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ఇవిగాక ఆశావర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, హోంగార్డులు ఇంకా అనేక మంది చిరుఉద్యోగుల జీతాలు సుమారు 40-50 శాతం వరకు పెంచాము. ఈవిధంగా సమాజంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం దేశంలో మరొకటి ఉండదేమో?” అని అన్నారు.
సాధారణంగా ప్రభుత్వ ఆదాయం ఎప్పుడూ బడ్జెట్ కంటే తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. ఉంటే అది మిగులు బడ్జెట్ అవుతుంది. తెలంగాణా ఏర్పడిన కొత్తలో ఆవిధంగా ఉండేది. కానీ ప్రభుత్వం ఈ ఖర్చులన్నీ భరిస్తూనే మరోవైపు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ అమలుచేస్తుంనందున తప్పనిసరిగా రుణాలు తీసుకోవలసి వస్తోందని అర్ధం అవుతోంది. అయితే సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు చేసిన డబ్బు వెనక్కు రాదు కనుక దానిపై ఖర్చు చేయడం వృధా అనుకోవడం కూడా సరికాదు. దానిని దీర్ఘకాలిక పెట్టుబడిగా చెప్పవచ్చు. ఈ సంక్షేమ కార్యకరమాల వలన ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే మళ్ళీ వారే ఆదాయం సృష్టించి ప్రభుత్వానికి ఇస్తారు. అభివృద్ధి పనులపై ఎంత పెట్టుబడి పెట్టినా అది తప్పకుండా రెట్టింపు లాభంతో వెనక్కువస్తుంది. ఆ ధైర్యంతోనే తెరాస సర్కార్ బారీగా రుణాలు స్వీకరిస్తోందని భావించవచ్చు.