రాష్ట్రంలో గర్భిణి స్త్రీలు, నవశిశువుల సంక్షేమం కోసం తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన ‘అమ్మ ఒడి’ పధకం శనివారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ పధకంలో నమోదు చేయించుకొన్న గర్భిణి స్త్రీలకు ప్రసవం అయ్యి, తల్లీ బిడ్డలు క్షేమంగా ఇంటికి చేరిన తరువాత కూడా 9 నెలల వరకు ప్రభుత్వమే వారి బాధ్యత తీసుకొంటుంది.
ముందుగా గర్భిణి స్త్రీలకు అవసరమైన పరీక్షలు, మందులు అందజేస్తారు. ఆ తరువాత ప్రభుత్వాసుపత్రులలో ప్రసవించిన వారికి ఆడపిల్ల పుడితే రూ. 13,000, మగపిల్లాడు పుడితే రూ.12,000 మూడు వాయిదాలలో అందజేస్తారు. అది తల్లిపిల్లలకు మందులు, పౌష్టికాహారం, రవాణా ఖర్చులు ఇతర అవసరాల కోసం అందజేయబడుతోంది. అదిగాక ప్రసవానంతరం రూ.3,150 విలువగల కేసీఆర్ కిట్స్ అందజేస్తారు. వాటిలో బేబీ బెడ్, బేబి పౌడర్, నూనె, సబ్బులు, ఆటవస్తువు, దోమతెర, రెండు జతల బట్టలు, రెండు చీరలు, కిట్ బ్యాగ్ బాస్కెట్ వగైరా ఉంటాయి.
ఈ పధకంలో పేర్లు నమోదు చేయించుకొన్న గర్భిణి స్త్రీలకు నేటి నుంచి ఈ కిట్స్ అందజేయబడతాయి. ఈ పధకంలో గర్భిణి స్త్రీలు తమ ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలను స్థానిక ఏ.ఎన్.ఎం. లేదా అశావర్కర్ల సహాయంతో నమోదు చేయించుకోవచ్చు. అప్పుడు వారికి మధర్ అండ్ చైల్డ్ గుర్తింపు కార్డును జారీ చేయబడుతుంది.
ఈ పధకం మధ్యతరగతి, ముఖ్యంగా నిరుపేద మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. అయితే సాధారణంగా ఇటువంటి పధకాలలోనే బారీగా అవినీతి జరుగుతుంటుంది. దుబ్బాక తెరాస ఎమ్మెల్యే భార్య సుజాతనే లంచం అడగిన (గాంధీ) ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిరుపేద గర్భిణి స్త్రీలు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి వచ్చినప్పుడు వారిని లంచం కోసం పీడించకుండా ఉంటారనుకోలేము. కనుక ఈ పధకం ప్రవేశపెట్టడంలో తెరాస ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిందో, దానిని అవినీతికి చోటులేకుండా సమర్ధంగా, విజయవంతం అమలుచేయడంలో అంతకంటే ఎక్కుఅవ శ్రద్ధ చూపవలసి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇది దీర్గకాలిక (శాశ్విత) పధకం కనుక దీనిలో ఎప్పుడైనా..ఎక్కడైనా అవినీతి జరిగే అవకాశాలు ఎక్కువ. అదే జరిగితే మంచి ఉద్దేశ్యంతో చేసిన ఈ పని వలన ప్రభుత్వానికి మంచిపేరు రాకపోగా అప్రదిష్ట మూటగట్టుకోవలసి వస్తుంది. కనుక ప్రభుత్వం దీనిపై అడుగడుగునా గట్టి నిఘా, పర్యవేక్షణ ఉంచడం చాలా అవసరం.