కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న సంగారెడ్డి బహిరంగ సభలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలను దుమ్ము దులిపేశారు. ఆయన ప్రసంగంలో రాష్ట్రం, దేశం అభివృద్ధి, బలహీనవర్గాల సంక్షేమం, రైతుల సమస్యలు, ఉద్యోగాలు మొదలైన అనేక అంశాలపై చాలా ధాటిగా మాట్లడేశారు. నిజానికి అవన్నీ చేయడం చాలా కష్టమైన పని కానీ వాటి గురించి మాట్లాడం చాలా తేలికైనా పని. అందుకే రాహుల్ తో సహా కాంగ్రెస్ నేతలు అందరూ కేసీఆర్, మోడీ సర్కార్ లను సులువుగా విమర్శించగలుగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రదండం తిప్పేసి అన్ని సమస్యలను చిటికెలో పరిష్కరించేస్తామన్నట్లు రాహుల్ గాంధీ మాట్లాడారు. అది అంత సులువైన పనే అయితే కేంద్రంలోని, రాష్ట్రంలో పదేళ్ళపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పనులన్నీ ఎందుకు చేయలేకపోయింది? చేసి ఉండి ఉంటే అసలు తెలంగాణా డిమాండ్ వచ్చి ఉండేదే కాదు కదా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చాలా కాలం కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలించింది. దాని కృషి, ప్రయత్నాల వలన దేశంలో జరిగిన అభివృద్ధి కంటే సహజంగా కాలంతో బాటు దానంతట అదే జరిగిన అభివృద్ధి ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ హయంలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ జరిగిందనే వాదనలో బహుశః ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండకపోవచ్చు. దేశ సంపదను, సహజవనరులను కాపాడి దేశాభివృద్ధి కోసం వినియోగించకుండా అడ్డుగోలుగా అవినీతిపరులు దోచుకోవడానికి సహకరించింది. కాంగ్రెస్ వలన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఉండవచ్చు. కానీ ఆ తరువాత కాంగ్రెస్ వలన దేశానికి కలిగిన నష్టాన్ని ఎవరూ అంచనా వేయలేము.
కాంగ్రెస్ హయంలోనే దేశ వ్యాప్తంగా వ్యవసాయం, పరిశ్రమలు, ప్రధానంగా..ఉత్పత్తిరంగం నాశనం అయిపోయింది. ఆ కారణంగా దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగి లక్షాలాది మంది భారతీయులు పొట్ట చేత్తో పట్టుకొని విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. దేశవ్యాప్తంగా వేలాది రైతులు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినా తరువాత రాహుల్ గాంధీ స్వయంగా అన్ని రాష్ట్రాలలో పర్యటించి ఆ రైతు కుటుంబాలను పరామర్శించడమే అందుకు బలమైన నిదర్శనం.
ఇక రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన భూసేకరణ చట్టం-2013లో ఆచరణ సాధ్యం కాని షరతులు, నియమనిబంధనలు విపరీతంగా ఉన్నందునే కాంగ్రెస్ హయంలో కూడా దానిద్వారా ఎక్కడా భూసేకరణ చేయలేకపోయిన సంగతి బహుశః రాహుల్ గాంధీకి తెలిసి ఉండకపోవచ్చు. చట్టం ద్వారా ప్రజల హక్కులు, ప్రయోజనాలు కాపాడటం ఎంత ముఖ్యమో, భూసేకరణకు ప్రభుత్వానికి కూడా అంతే వెసులుబాటు కలిగి ఉండటం చాలా అవసరం. భూసేకరణ చట్టం-2013లో ఆ వెసులుబాటు లేనందునే మోడీ సర్కార్ తో సహా దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దానిని పక్కన పెట్టి వేరేగా మళ్ళీ చట్టాలు చేసుకొంటున్నాయి. తెరాస సర్కార్ కూడా అదే పనిచేసింది. కనుక దానిని తప్పు పట్టలేము.
నెహ్రూ కాలం నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీలో వంశపారంపర్య పాలనే సాగుతోంది. యూపిఏ సర్కార్ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కోసం ఆయన తల్లి ప్రధానమంత్రి కుర్చీలో కర్చీఫ్ వేసి ఉంచారు. కానీ ఆయన ధైర్యం చేయలేకపోయారు. చేసి ఉండి ఉంటే డాక్టర్ మనోమోహన్ సింగ్ స్థానంలో ఆయనే ప్రధానమంత్రిగా దేశాన్ని పాలించి ఉండేవారు కదా. నెహ్రు కుటుంబానికి చెందినవాడిననే ఏకైక అర్హతతోనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలనుకొంటున్న సంగతి తెలిసిందే. లేకుంటే రాహుల్ కంటే ఎక్కువ అనుభవం, తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు, రాజకీయ చతురత కలిగిన సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో చాలా మందే ఉన్నారు. తన పార్టీలో కుటుంబపాలన జరిగితే తప్పు లేదని భావిస్తున్న రాహుల్ గాంధీ, కేసీఆర్ కుటుంబాన్ని వేలెత్తి చూపడం విడ్డూరంగానే ఉంది.