మియాపూర్ భూకుంభకోణంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హస్తం ఉందని, ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు డబ్బులు వసూలు చేసిపెట్టే ఏజంట్ లాగ వ్యవహరిస్తుంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయనపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అంతకంటే ముందుగా మహంకాళీ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పిర్యాదు చేయబోతున్నాని హెచ్చరించారు. దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఇలాగే నోటికి వచ్చినట్లు అవాకులు చవాకులు వాగుతున్నారని ఇక ఎంత మాత్రం సహించేది లేదని మంత్రి తలసాని అన్నారు. త్వరలోనే దిగ్విజయ్ సింగ్ కు లీగల్ నోటీసులు పంపింస్తానని మంత్రి తలసాని చెప్పారు.
దిగ్విజయ్ సింగ్ ఇంతకు ముందు రాష్ట్ర పోలీస్ శాఖపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీస్ శాఖే స్వయంగా ఒక నకిలీ ఐసిస్ వెబ్ సైట్ సృష్టించి రాష్ట్రంలోని ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు వెళ్ళేలా ప్రోత్సహిస్తూ, వారు ఆ దారిలోకి మళ్ళినప్పుడు వారిని తామే కనిపెట్టి పట్టుకొన్నట్లు ప్రజలకు చూపిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు మంత్రి కేటిఆర్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పి తన మాటలను ఉపసంహరించుకోకపోతే న్యాయస్థానంలో కేసు వేస్తామని హెచ్చరించారు కూడా. కానీ దిగ్విజయ్ సింగ్ తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, తన వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని కనుక దమ్ముంటే తనపై కేసుపెట్టి అరెస్ట్ చేయమని సవాలు విసిరారు కూడా కానీ తెరాస సర్కార్ ఎందుకో మళ్ళీ స్పందించలేదు. దిగ్విజయ్ సింగ్ చేస్తున్న ఆరోపణలు ముఖ్యమంత్రి, మంత్రులు, పోలీస్ శాఖ, తెరాస సర్కార్ గౌరవానికి భంగం కలిగించేవిధంగా ఉంటున్నాయి. ఆయన ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఆయనపై తెరాస సర్కార్ చర్యలు తీసుకోవలసిన అవసరం కనబడుతోంది. లేకుంటే ఆయన ఆరోపణలే నిజమని ప్రజలు కూడా నమ్మే ప్రమాదం ఉంటుంది.