ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు నవనిర్మాణ దీక్ష సందర్భంగా చేసిన ప్రసంగం వింటే ఇంతకీ అయన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మనస్పూర్తిగా అంగీకరించారా లేదా? అనే అనుమానం కలుగకమానదు.
విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, “నేటికీ నేను రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రజాభీష్టానికి విరుద్దంగా యూపిఏ ప్రభుత్వం పార్లమెంటు తలుపులు, కిటికీలు మూసి మరీ విభజన చేసింది. కేంద్రప్రభుత్వం ఒక పెద్దమనిషి తరహాలో రాష్ట్రానికి న్యాయం చేయాలని నేను డిల్లీలో నిరాహార దీక్ష చేసినా యూపిఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆరోజున రాష్ట్రాన్ని విడదీశారు. కనుక ఇది మనకు ఒక బ్లాక్ డే వంటిది,” అని అన్నారు.
అయితే ఆనాడు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ మీరు యూపిఏ ప్రభుత్వానికి లేఖ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈ విభజనకు, ఈరోజు ఏపి రాష్ట్ర దుస్థితికి మీరు కారకులు కారా?” అని ఏపి వైకాపా నేత శ్రీనివాస్ ప్రశ్నించారు. దానిని చంద్రబాబు కాదనలేరు.
చంద్రబాబు రాష్ట్ర విభజనకు వ్యతిరేకించి ఉండి ఉంటే ఆరోజు ఆ లేఖ ఇచ్చి ఉండకూడదు. కానీ అలాగ చేస్తే తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించినట్లు అవుతుంది.దాని వలన తెలంగాణాలో తెదేపాకు రాజకీయంగా నష్టం కలుగుతుందనే ఆలోచనతో లేఖ ఇచ్చారు. అప్పుడు లేఖ ఇచ్చి ఇప్పుడు యూపిఏ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.
రాష్ట్ర విభజనలో ఏపికి తీరని అన్యాయం జరిగిందని దానికి యూపిఏ ప్రభుత్వమే కారణమని నిందించినా అర్ధం ఉండేది. కానీ ఈ రెండూ ముడిపెట్టి నిందిస్తున్నారు. నిజానికి విభజనలో ఏపికి అన్యాయం జరుగుతుందని ఆయన ముందే గ్రహించినప్పుడు, అప్పుడే ఏపి ప్రజల వద్దకు వెళ్ళి రాష్ట్ర విభజన అనివార్యమని కనుక మన ప్రయోజనాలను కాపాడుకోవడానికే కేంద్రంతో గట్టిగా పోరాడుదామని ధైర్యంగా చెప్పగలిగి ఉంటే, ప్రజలను సరైన దిశలో నడిపించిన గొప్ప నాయకుడుగా పేరు పొంది ఉండేవారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కంటే తన పార్టీ ప్రయోజనాలే మిన్న అనుకొన్నందున తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాలలో తన పార్టీ నేతల చేత రాష్ట్ర విభజనకు అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు చేయించారు. మళ్ళీ ఇప్పుడు ఈవిధంగా మాట్లాడుతున్నారు. ఈవిధంగా ద్వంద వైఖరి ప్రదర్శించడం వలననే ఆయన ఆశించిన ఫలితం రాకపోగా రెండు రాష్ట్రాలలో ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకొంటున్నారని చెప్పక తప్పదు.