రాజకీయ నిరుద్యోగమే వారిచేత అలాగా మాట్లాడిస్తోంది: కేటిఆర్

June 02, 2017


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా ఐటి శాఖామంత్రి కేటిఆర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

“మీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని మీరు చెప్పుకొంటారు. కానీ ఈ మూడేళ్ళలో మేరు రాష్ట్రానికి చేసిందేమీ లేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. వాటికి మీ సమాధానం ఏమిటి?” అనే ప్రశ్నకు “2001లో ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన  మూడు రాష్ట్రాలలో ఇంతవరకు ఇంకా స్థిరపడే ప్రయత్నాలలోనే ఉన్నాయి. ఇక ఝార్ఖండ్ రాష్ట్రంలో అయితే ఈ మద్యనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. కానీ మన రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళు కూడా కాకమునుపే సకల హంగులు సమకూర్చుకొని అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నాము. 

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం వంటి మనం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర రాష్ట్రాలు కూడా అమలుచేస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్, స్వచ్చా భారత్ వంటి అనేక పధకాల అమలులో మనమే ముందున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చాలా బాగుందని నీతి ఆయోగ్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, మెచ్చుకొంటున్నారు. 

కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇదేమీ కనబడటం లేదు. ప్రభుత్వం ఏ పని ప్రారంభించినా దానిని తప్పుపట్టడం, నిరాధారమైన ఆరోపణలు, విమర్శలు చేయడమే పని. వారి రాజకీయ నిరుద్యోగమే వారిచేత ఆ విధంగా మాట్లడిస్తోందని నేను భావిస్తున్నాను. అదే..కర్నాటక తమిళనాడు రాష్ట్రాలలో కావేరీ జలాలు లేదా మరొక సమస్య ఎదురైతే ఆ రాష్ట్రాలలో ప్రతిపక్షాలన్నీ అధికారపార్టీకి అండగా నిలబడి తమ ప్రత్యర్ధులతో పోరాడుతాయి. కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రం ఎక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నా కోర్టులలో కేసులు వేసి అడ్డుకొంటుంటాయి. వారిని మేము ఏమీ చేయలేకపోవచ్చు కానీ తగిన సమయం వచ్చినప్పుడు ప్రజలే వారికి గట్టిగా బుద్ధి చెపుతారు. 

ఈ మూడేళ్ళలో జరిగిన ఎన్నికల ఫలితాలను చూసినట్లయితే రాష్ట్ర ప్రజలు ఎవరి పక్షాన్న ఉన్నారో అర్ధం అవుతుంది. వరంగల్ తెరాస ప్లీనరీ సభలో అది మళ్ళీ మరోమారు నిరూపితం అయ్యింది. కనుక మేము సరైన దిశలోనే పయనిస్తున్నామని భావిస్తున్నాము. కనుక ప్రతిపక్షాలు ఎంత కాకిగోల చేస్తున్నా మా పని మేము చిత్తశుద్ధితో చేసుకొని పోతున్నాము. మా చిత్తశుద్ధిని, మేము చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాము తప్ప ప్రతిపక్షాలకు కాదు. మాకు అధికార యావ లేదు. ప్రజలకు నచ్చినన్ని రోజులు అధికారంలో ఉంటాము వద్దనుకొన్న రోజున తప్పుకొంటాము,” అని మంత్రి కేటిఆర్ అన్నారు. 


Related Post