ఇక్కడ పండగ..అక్కడ దీక్షలు

June 02, 2017


img

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొని ఉంది. అనేక దశాబ్దాల పోరాటాలు, బలిదానాలతో తెలంగాణా రాష్ట్రం సాధించుకొన్నందున అది ప్రజలందరికీ గర్వకారణమే..సంతోషం కలిగించే విషయమే కనుక ఇది కుల,మత,బాష,వర్గాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి జరుపుకొనే పండుగ కనుకనే రాష్ట్రమంతటా పండుగ వాతావరణం కనిపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ రాష్ట్ర విభజన జరిగి ఏపి మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్ర విభజనలో ఏపికి అప్పటి యూపిఏ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. కనీసం రాజధాని కూడా ఏర్పాటు చేయకుండా రాష్ట్రాన్ని విడగొట్టింది. విభజన తరువాత తెలంగాణా దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా అవతరిస్తే, ఆంధ్రప్రదేశ్ ఆర్ధికపరిస్థితి చాలా దయనీయంగా మారింది. కనీసం ఆదాయమార్గాలు కూడా లేకపోవడంతో కేంద్రంపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇవి కాక ఇంకా అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన చేసి, రాష్ట్రాన్ని ఈ దుస్థితిలో నెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు బదులుగా గత మూడేళ్ళుగా నవనిర్మాణ దీక్షలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రం యొక్క ప్రస్తుత పరిస్థితి ఏవిధంగా ఉంది? రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రభుత్వం ఏమి చేస్తోంది? ఇక ముందు ప్రజలు, ప్రభుత్వం ఏమి చేయాలి? అనే చర్చలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. 

విజయవాడలో ప్రధాన కూడలి అయిన బెంజి సర్కిల్ వద్ద మరికొద్ది సేపటిలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలు ప్రారంభిస్తారు. వారం రోజులపాటు సాగే ఈ దీక్షలలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు వగైరా అంశాలపై తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించి, రాష్ట్రాభివృద్ధిలో వారి సహకారం కోరుతారు. కనుక ఏపిలో రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు ఉండవు. వాటికి బదులుగా గంభీరమైన ఈ నవ నిర్మాణ దీక్షలు ఉంటాయి.


Related Post