కాంట్రాక్టర్ల కోసమే తెరాస సర్కార్ పని చేస్తోందా?

June 01, 2017


img

సంగారెడ్డిలో జరిగిన ప్రజాగర్జన సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనేక సూటి ప్రశ్నలు వేశారు. తెలంగాణా ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని, తెరాస అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చెప్పిన మీరు ఈ మూడేళ్ళలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని సంస్థలను స్థాపింపజేశారు? అని ప్రశ్నించారు. మీరు ఉద్యోగాలు ఇవ్వడం నిజమైతే రాష్ట్రంలో నిరుద్యోగులు ఎందుకు మీ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉందని ప్రశ్నించారు. 

రైతులందరికీ పంటరుణాలు మాఫీ చేస్తామని చెప్పి కొంతమంది రైతులకు మాత్రమే అది కూడా వాయిదాల పద్దతిలో కొంత మాఫీ చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. కానీ రైతులందరి పంట రుణాలను మాఫీ చేసేసినట్లు ఎందుకు గొప్పలు చెప్పుకొంటున్నారని ప్రశ్నించారు. ఒకవేళ పంటరుణాల మాఫీ నిజమైతే మరి బ్యాంకులు రైతులకు ఎందుకు మళ్ళీ రుణాలు ఇవ్వడమ లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వకపోయినా ఒకేసారి రైతుల రుణాలను మాఫీ చేసిందని రాహుల్ గుర్తు చేశారు. రైతుల ఆత్మహత్యలలో తెలంగాణా రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో ఉందని అన్నారు. ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో 2,855 మంది రైతులు, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో వందమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదేనా మీరు సాధించిన బంగారి తెలంగాణా? అని రాహుల్ ప్రశ్నించారు.     

కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొని పరిపాలిస్తే, తెరాస సర్కార్ కాంట్రాక్టర్లు, కార్పోరేట్ సంస్థల కోసం పనిచేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీంబర్స్ మెంట్ చేసి విద్యార్ధులను ఆదుకొంటే, తెరాస సర్కార్ ఫీజు రీంబర్స్ మెంట్ చేయకపోగా చక్కగా నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ కార్పోరేట్ కళాశాలకు సహకరిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరూ మాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేసేస్తున్నారు తప్ప ఈ మూడేళ్ళలో సాధించిందేమీ లేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. 



Related Post