సంగారెడ్డిలో జరిగిన ప్రజా గర్జన సభలో ప్రసంగించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కడిగిపడేశారు. గతానికి భిన్నంగా ఈసారి ఆయన ప్రసంగంలో అర్ధవంతంగా సాగింది. ఆయన తన ప్రసంగాన్ని అసలు తెలంగాణా రాష్ట్రం ఎందుకు ఏర్పడిందో చెప్పాలంటూ ప్రజలను ప్రశ్నించడంతో మొదలుపెట్టి, తెలంగాణా ఏర్పడితే ఏమవుతుందని ప్రజలు కలలుకన్నారో వివరించారు. రైతులకు నీళ్ళు, నిరుద్యోగులకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయనే ఆశతోనే పోరాడి సాధించుకొన్న తెలంగాణాలో ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అన్నారు.
తెలంగాణా ప్రజల ఆకాంక్షలను సోనియా గాంధీ అర్ధం చేసుకోగాలిగారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధం చేసుకోలేకపోయారని అన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకొంటారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారని ప్రజలు కేసీఆర్ ను నమ్మి అధికారం కట్టబెడితే, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టాలను సైతం మార్చేసి మరీ నిరుపేద రైతుల భూములను బలవంతంగా గుంజుకొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం తమ భూములను ఎక్కడ గుంజుకొంటుందో అనే భయంతో రైతన్నలు భయంభయంగా జీవిస్తుంటే, మరో పక్క వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం వలన రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని అన్నారు. ఇదేమి అన్యాయం అని ప్రశ్నించిన రైతుల చేతులకు బేడీలు వేసి జైళ్ళలో పెట్టడానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం వెనకాడటం లేదని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు తెలంగాణాలో మీ భూములు మీవి కావు.. మీ ఉద్యోగాలు మీవి కావు..అన్నీ కేసీఆర్ స్వంతమే అన్నట్లు వ్యవహరిస్తున్నారని రాహుల్ అన్నారు. కేసీఆర్ కుటుంబం కోసమేనా మీరందరూ పోరాడి తెలంగాణా సాధించుకొన్నారు? కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారో చెప్పాలని ప్రశ్నించారు.