నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పాలనలో పారదర్శకత, వేగం కనబడుతోందని ఆయన విమర్శకులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే రైల్వే ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి మోడీ సర్కార్ పాసింజర్ ట్రైన్ కంటే మెల్లగా కదులుతొందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మోడీ అధికారంలోకి రాగానే ఎవరూ ఊహించని విధంగా ముంబై-అహ్మదాబాద్ మద్య బులెట్ రైల్ ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేశారు. ఆ తరువాత దాని కోసం జపాన్ కంపెనీతో ఒప్పందం కూడా చేసుకొంది. కానీ ఆ తరువాత ఆ ప్రాజెక్టు ఊసే వినబడలేదు.
అదేవిధంగా దేశంలో రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్ళ కంటే వేగంగా నడిచే హై స్పీడ్ రైళ్ళను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వాటికోసం స్పెయిన్ కు చెందిన టాల్గో అనే సంస్థతో ఒప్పందం చేసుకొంది. ఆ సంస్థ తన వద్ద ఉన్న 9 బోగీలతో కూడిన హై స్పీడ్ రైలును భారత్ కు తీసుకువచ్చి సెప్టెంబర్ 2016లో డిల్లీ-ముంబై మద్య పలుమార్లు విజయవంతంగా నడిపించి చూపింది.
డిల్లీ-ముంబై మద్య 1,400 కిమీ దూరం ఉంది. గంటకు 70 కిమీ వేగంతో పయనించే మన రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఆ దూరాన్ని 16 గంటలలో అధిగమిస్తే, గంటకు 105 కిమీ వేగంతో పయనించే టాల్గో రైలు ఆ దూరాన్ని 12 గంటలలో అధిగమించగలిగింది. అనేకసార్లు విజయవంతంగా పరీక్షలు నిర్వహించిన తరువాత రైల్వే అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక సదుపాయాలు కలిగిన టాల్గో హై స్పీడ్ రైళ్ళను నడపడానికి కొత్తగా..వేరేగా పట్టాలు వేయనవసరం కూడా లేదు. ప్రస్తుతం ఉన్నవాటి మీదనే నడిపించుకోవచ్చు.
కనుక మొదటి దశలో నాలుగు టాల్గో హై స్పీడ్ రైళ్ళను తక్కువ దూరం ఉండి రద్దీ ఎక్కువున్న చెన్నై-బెంగళూరు, డిల్లీ-అమృత్ సర్, డిల్లీ-లక్నో మరియు ముంబై-అహ్మదాబాద్ మద్య నడిపించాలని నిర్ణయించారు. భారత్ రైల్వే, టాల్గో సంయుక్తంగా వాటిని నడిపించి లాభాలను పంచుకోవాలని సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఇదంతా జరిగి నేటికి 8 నెలలపైనే అయ్యింది. కానీ ఇంతవరకు మోడీ సర్కార్ దీనిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. భారత్ రైల్వే అధికారులను టాల్గో సంస్థ ప్రతినిధులు సంప్రదించినా ఈ ప్రాజెక్టులో కదలిక రాలేదు. ఇక ఎప్పటికైనా వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. దీని పరిస్థితే ఇలాగ ఉన్నప్పుడు ఇక బులెట్ ట్రైన్ ఏర్పాటు సాధ్యమా? అంటే కాదనే అనిపిస్తుంది.