రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అంబులెన్స్ కుంభకోణం బయటపడటంతో అప్పటి ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖామంత్రి రాజయ్య పదవి ఊడింది. ఆ తరువాత సాగునీటి ప్రాజెక్టులలో, మిషన్ భగీరథలో బారీగా అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా మిషన్ భగీరథపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ఆరోపణలను తెరాస సర్కార్ గట్టిగా ఖండిస్తోందే తప్ప వాటిపై ఎటువంటి విచారణకు ఆదేశించలేదు.
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్..అతనితో అధికార, ప్రతిపక్ష నేతలకు, పోలీస్ అధికారులకు సంబంధాలున్నట్లు బయటపడింది. కానీ ఆ కేసులో కూడా ఇంతవరకు ఒక్క రాజకీయనాయకుడిపై కేసు నమోదు కాలేదు. రాష్ట్రంలో కొన్నివందల మంది నయీం ఆగడాలకు బలైపోయారు. అనేకమంది ధనమానప్రాణాలను పోగొట్టుకొన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ కేసు ఊసే వినిపించడం లేదు. అంటే నయీం బాధితులందరికీ న్యాయం జరిగిపోయినట్లేనా? అతనితో ఎవరూ చేతులు కలపలేదనుకోవాలా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు.
దాని తరువాత జి.హెచ్.ఎం.సి. పరిధిలో కాంట్రాక్టర్ల అవినీతి కధలు బయటకు వచ్చాయి. వాటి తరువాత వాణిజ్యపన్నుల శాఖలో నకిలీ చలానాల కుంభకోణం బయటపడింది. తరువాత రవాణాశాఖలో సెకండ్ వెహికల్ కుంభకోణం, తాజాగా మియాపూర్ లో 700 ఎకరాల ప్రభుత్వ భూముల కుంభకోణం బయటపడింది.
ప్రభుత్వ శాఖలలో అవినీతి సర్వసాధారణమైన విషయం అయిపోయింది. ఇది ఈరోజు కొత్తగా మొదలయింది కాదు ఇప్పటితో ఆగేది కాదని అందరికీ తెలుసు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత కటిన చర్యలు తీసుకొంటున్నా ప్రభుత్వ శాఖలలో అవినీతి తగ్గకపోగా నిత్యం ఎక్కడో అక్కడ బారీగా అవినీతి బయటపడుతుండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఏపిలో తెదేపా సర్కార్ పాలనలో నానాటికీ అవినీతి పెరిగిపోతోందని దాని మిత్రపక్షాలైన భాజపా, జనసేన పార్టీలే ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణాలో కూడా అదే జరుగుతోంది. కానీ అవినీతి బయటపడగానే దానిని మొగ్గలోనే తుంచేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్నారు. అది నిజమే కావచ్చు. అయినా ఎక్కడో అక్కడ అవినీతి జరుగుతూనే ఉంది. మియాపూర్ భూకుంభకోణం బయటపడిన తరువాత ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిసిన తరువాత కూడా మేడ్చల్, ఇంకా అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో యాధాప్రకారం అవినీతి జరుగుతున్నట్లు ఏసిబి దాడులలో గుర్తించడం గమనిస్తే అవినీతిని అరికట్టడానికి తెరాస సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు సరిపోవనిపిస్తుంది.
ఈవిధంగా వరుసగా అవినీతి బాగోతాలు వెలుగులోకి వస్తుంటే అవి తెరాస సర్కార్ కు తీరని అప్రదిష్ట కలిగించి, రాజకీయంగా నష్టం కలిగించవచ్చు. కనుక అవినీతికి పాల్పడినవారి ఆస్తుల జప్తు చేయడం, జైలుకు పంపించడం, తిన్న సొమ్ము అంతా కక్కించడం, ప్రమోషన్లు నిలిపివేయడం వంటి కటిన చర్యలు తీసుకొన్నప్పుడే ఎవరైనా అవినీతికి పాల్పడేందుకు భయపడతారు. అలాకాక అవినీతిపరులను ఒక చోటి నుంచి మరొక చోటుకు బదిలీ చేసి చేతులు దులుపుకొంటే అవినీతి ఆగిపోదు. అది కూడా వారితోబాటు ఆ ప్రాంతానికి బదిలీ అవుతుంది అంతే.