కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం తెలంగాణా పర్యటనకు వస్తున్నారు. ఈరోజు సాయంత్రం సంగారెడ్డిలోని స్థానిక అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న ప్రజాగర్జన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన డిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్న బారీ ఊరేగింపుగా సంగారెడ్డి చేరుకొంటారు. ప్రజాగర్జన సభ కోసం కాంగ్రెస్ నేతలు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈరోజు సాయంత్రం జరుగబోయే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. తెరాస సర్కార్ వైఫల్యాలపై ఛార్జ్-షీట్ ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ముఖ్యాంశాలను ప్రకటించడం. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ మల్లన్నసాగర్ నిర్వాసితులు, మిర్చి రైతులు, నిరుద్యోగులతో ముఖాముఖీ సమావేశం అవుతారని సమాచారం.
భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా నల్లగొండలో పర్యటించి వెళ్ళిపోయిన తరువాత తెరాస-భాజపాల మద్య మాటల యుద్ధం జరిగింది. అది ఇప్పుడిప్పుడే మెల్లగా చల్లారుతున్న సమయంలో రాహుల్ గాంధీ పర్యటనకు వస్తున్నారు. ఆయన కూడా కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించడం ఖాయం అని తేలింది కనుక ఆయన వెళ్ళిన తరువాత కాంగ్రెస్-తెరాసల మద్య మరో కొత్త యుద్ధం మొదలవడం ఖాయం.