తెలంగాణా రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిన్న తెలంగాణా జర్నలిస్టుల వేదిక అధ్వర్యంలో ‘మూడేండ్ల తెలంగాణా’ అనే అంశంపై రౌండ్ టేబిల్ సమావేశం జరిగింది. దానిలో కాంగ్రెస్, వామపక్షాలు, టిజెఎసి, వివిద ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఆ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ పై నిప్పులు చెరిగారు.
“తెలంగాణా కోసం పోరాడిన తెరాస అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, తమ ఆకాంక్షలు నెరవేరుతాయని నమ్మిన ప్రజలు తెరాసకు అధికారం కట్టబెడితే ప్రభుత్వం కొంత మంది వ్యక్తులకు మేలు కలిగించే విధంగా పాలన సాగిస్తోంది. రాష్ట్రంలో ఒక నయా జాగీర్దారీ పాలన సాగుతోంది. ప్రశ్నించేవారిని నిర్ధాక్షిణ్యంగా అణచివేయాలని చూడటం బాధాకరం. ఇది ప్రజాస్వామ్య విధానం కాదు. రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళవుతున్నా ఇంతవరకు ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదు. అనుకొన్న లక్ష్యాలలో ఒక్కటీ పూర్తికాలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం మేము కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. అభివృద్ధి కేవలం మాటలకే పరిమితం అయిపోయింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే చాలా అవేధన కలుగుతోంది. మా ఆశలన్నీ ఆశలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వానికి మెత్తగా..మంచిగా...మర్యాదగానే చెప్పి చూశాము. కానీ ప్రభుత్వం మా మాటలను వినేందుకు కూడా ఏ మాత్రం ఇష్టపడటం లేదు. తనకు నచ్చిందే చేస్తూ తాను చేసిందే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తోంది. తెలంగాణా సాధన కోసం పోరాడిన మేము చెప్పే మాటలు వింటే మీ కిరీటాలు పడిపోతాయా?” అని ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ ను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మియాపూర్ లో 700 ఎకరాల భూ కుంభకోణం గురించి కూడా ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ ను ప్రశ్నించారు. దాని వెనుక ప్రభుత్వంలో పెద్దలు ఎవరెవరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కొందరు వ్యక్తుల పేరిట ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ జరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు.
“మిషన్ భగీరధ పనులలో జరుగుతున్న బారీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టగలిగితే, ఆ డబ్బుతో రాష్ట్రంలో పేదలకు 20 లక్షల ఇళ్ళు కట్టించి ఇవ్వవచ్చును. రాష్ట్రం ఏర్పడిన మూడేళ్ళలోనే వరుసగా బయటపడుతున్న ఇటువంటి బారీ అవినీతి, అక్రమాలు, కుంభకోణాలను చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతోందని అన్నారు. దీనికోసమేనా పోరాడి తెలంగాణా సాధించుకొన్నాము? ఇది మేము కలలు కన్న తెలంగాణా కాదు. ఈ నిరంకుశ, అప్రజాస్వామిక, అవినీతి పాలనను చూసి చూసి మా సహనం కూడా నశించిపోయింది. ఇదివరకు తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాడాము. ఇప్పుడు తెలంగాణాను కాపాడుకోవడం కోసం పోరాడుతాము. మా పోరాటాలకు జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే ముహూర్తంగా నిర్ణయించుకొన్నాము,” అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.