అది కక్ష సాధింపా..లేక ఎన్నికల వ్యూహమా?

May 30, 2017


img

కేంద్రంలో భాజపాయే అధికారంలో ఉండగా కేంద్రమంత్రి ఉమాభారతితో సహా భాజపా సీనియర్ నేతలపై బాబ్రీ కేసు విచారణ మొదలుపెట్టడానికి సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్ వేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి లేనిదే సిబిఐ ఈ కేసును తిరగదోడే సాహసం చేసేది కాదని, ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే తనకు పక్కలో బల్లెంలాగ ఉన్న భాజపా సీనియర్ నేతలపై విచారణకు సిబిఐని అనుమతించి వారిపై కక్ష తీర్చుకొంటున్నారని కాంగ్రెస్ తో సహా అనేక పార్టీలు వాదిస్తున్నాయి. కానీ ఈ కేసులను ఎదుర్కొంటున్న నేతలలో ఏ ఒక్కరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించకపోవడం గమనార్హం. 

అయితే ఈకేసుపై మళ్ళీ విచారణ మొదలుపెట్టడం అంటే, దేశ ప్రజలలో నిద్రాణంగా ఉన్న హిందుత్వ వాదనలను తట్టి మేల్కొలపడమే అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఈ రెండేళ్ళ విచారణలో ప్రజలలోని ‘హిందూ సెంటిమెంట్’  క్రమంగా పతాకస్థాయికి చేరుకొని 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో భాజపా అనుకూల వాతావరణాన్ని సృష్టించవచ్చు. కనుక వారందరూ తమ పార్టీ కోసం గొప్ప త్యాగానికి సిద్దపడుతున్నట్లు చెప్పవచ్చు. బహుశః అందుకే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ఈ కేసును ఎదుర్కొంటున్న భాజపా సీనియర్ నేతలు గానీ పరస్పరం విమర్శలు చేసుకోవడం లేదు. అందరూ మౌనం పాటిస్తున్నారు. ఈ కేసు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ జరుగబోయే రాజకీయ పరిణామాలే ప్రధాని నరేంద్ర మోడీ తన గురుతుల్యులైన పార్టీ నేతలపై సిబిఐ విచారణకు ఎందుకు అనుమతించారనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు.  

తాజా సమాచారం: ఈరోజు లక్నో సిబిఐ కోర్టులో విచారణకు హాజరైన భాజపా సీనియర్ నేతలు అందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


Related Post