తెరాస చెప్పినట్లు ప్రతిపక్షాలు వినాలా?

May 30, 2017


img

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమి చెపితే అది తెరాస నేతలు, మంత్రులు, అధికారులు విని ఆయన ఆదేశాలను తూచాతప్పకుండా పాటించాలనుకోవడం సహజమే. అందులో తప్పు లేదు కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా తాము చెప్పినట్లుగానే నడుచుకోవాలనుకోవడమే చాలా విడ్డూరంగా ఉంది. మంత్రి హరీష్ రావు మాటలు విన్నట్లయితే ఆ సంగతి అర్ధం అవుతుంది. 

జూన్ 1వ తేదీన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న ప్రజా గర్జన సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఆ సభ నిర్వహించడానికి, దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం సభాముఖంగా తెరాస పాలనను, వైఫల్యాలను ఎండగట్టడమేనని కాంగ్రెస్ నేతలే విస్పష్టంగా చెపుతున్నారు.

ఇది హరీష్ రావుకు తెలియదనుకోలేము. కానీ ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి తన పార్టీని బలోపేతం చేసుకొంటే మాకేమి అభ్యంతరం లేదు కానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాటలు విని మా ప్రభుత్వం గురించి అవాకులు చవాకులు మాట్లాడితే నవ్వులపాలవుతారు. మా ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకొని, వాటిని మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా అమలయ్యేలా చూడండి. దాని వలన మీపార్టీకే మేలు కలుగుతుంది. మీరు రైతుల సమస్యలు తెలుసుకొనేందుకు వారితో మాట్లాడబోతున్నారని వింటున్నాము. మీరు సింగూరు ప్రాజెక్టు క్రింద నీళ్ళు అందుకొంటున్న రైతులతో మాట్లాడితే బాగుంటుంది. మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గమనించకుండా అనవసరంగా విమర్శలు చేస్తే మీ పెద్దరికం గంగలో కలిసిపోతుంది,” అని హరీష్ రావు అన్నారు. 

తాము కోరుకొంటున్నట్లుగా ఇతర పార్టీలు వ్యవహరించాలని తెరాస భావిస్తున్నప్పుడు, అవి కోరుకొంటున్నట్లుగా తెరాస వ్యవహరించగలదా? అంటే కాదనే సమాధానం వస్తుంది. ధర్నా చౌక్ విషయంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎంత ఒత్తిడి చేసినా తెరాస సర్కార్ అందుకు అంగీకరించడం లేదు. ఇంత చిన్న విషయంలోనే తెరాస అంత పట్టుదలగా వ్యవహరిస్తున్నప్పుడు, తమను రాజకీయంగా చావుదెబ్బ తీస్తున్న తెరాస మాటలను ప్రతిపక్షాలు ఎందుకు వినాలి? వింటే అవి ప్రతిపక్షాలు అనిపించుకోవు. తెరాస అనుబంద సంఘాలనిపించుకొంటాయి.


Related Post