సర్వే ఫలితాలు: భాజపాకే అధికారం

May 30, 2017


img

ఇప్పటికిప్పుడు తెలంగాణాలో ఎన్నికలు నిర్వహిస్తే 119 సీట్లలో 111 సీట్లు తెరాసకే వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో ఎంత ప్రకంపనాలు పుట్టిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. అది బోగస్ సర్వే అని ప్రతిపక్షాలు వాదిస్తుంటే, అది నూటికి నూరు శాతం నిజమని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా వాదించారు. ఇప్పుడు తాజాగా మరో సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే ఈసారి సర్వే చేసింది ప్రభుత్వం కాదు. టైమ్స్ నౌ అనే ప్రముఖ ఇంగీల్ష్ టీవి ఛానల్, ఓటర్స్ మూడ్ అనే ఏజన్సీతో కలిసి దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో 52 లోక్ సభ నియోజక వర్గాలలోని 15,600 మంది ఓటర్లను ప్రశ్నించి ఈ వివరాలను రాబట్టింది.

దాని తాజా సర్వేలో  ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు నిర్వహిస్తే మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి లోక్ సభలో 342 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి రాగలదని జోస్యం చెప్పింది. కాగా యూపిఏ కూటమికి 82 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ఎన్డీయే కూటమికి ఈసారి 7 శాతం ఓట్లు పెరుగవచ్చని పేర్కొంది. 2014 ఎన్నికలలో ఎన్డీయే కూటమికి 31 శాతం ఓట్లు రాగా ఈసారి 38 శాతం వరకు వస్తాయని అంచనా వేసింది.

అంటే మోడీ పాలనకు, సంస్కరణలకు, సాహసోపేతమైన నిర్ణయాలకు దేశప్రజలు ఆమోదం తెలుపుతున్నట్లే భావించవచ్చు. ఈ విషయంలో మోడీకి 62 శాతం సమర్ధించగా 32 శాతం వ్యతిరేకించారు. మిగిలినవారు తటస్థంగా ఉన్నారు. ఈసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా భాజపా పశ్చిమబెంగాల్, ఓడిశా రాష్ట్రాలలో బలం పుంజుకొంటుందని సర్వేలో తేలింది. ఈ సర్వే ఫలితాలపై కాంగ్రెస్, తెరాసలు ఏమంటాయో ఊహించవచ్చు.   

మోడీ సర్కార్ అమలుచేస్తున్న విదేశీవిధానానికి కూడా దేశప్రజలు మద్దతు పలుకుతున్నారు. మోడీ ప్రభుత్వ విదేశీ విధానం ఇదివరకటి కంటే బలంగా ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా అవునని 66.18 శాతం మంది, కాదని 27.62 శాతం, తెలియదని 5.82 శాతం మంచి చెప్పారు. 

పాకిస్తాన్ ను అదుపు చేసేందుకు మళ్ళీ సర్జికల్ స్ట్రయిక్స్ చేయవలసి ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా 72.0 శాతం మంది అవునని,  24.18 శాతం మంది కాదని, 3.24 శాతం మంది తెలియదని చెప్పారు. 


Related Post