చంద్రబాబు మోసగాడు: కేసీఆర్

May 29, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాళ్ళ తెలంగాణా భవన్ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబు నాయుడు ఒక మోసగాడు. అటువంటి వాళ్లకు తెలంగాణాలో స్థానం లేదు.   ఆయన ఆంధ్రాలో రైతులను, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచుతున్నాడు. అక్కడ తన రాష్ట్రం సంగతి చూసుకోకుండా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఇంకా వేలు పెడుతూనే ఉన్నాడు. ఇక్కడ తెదేపా అడ్రెస్ లేకుండా పోయింది. అయినా వచ్చే ఎన్నికలలో తెదేపాయే గెలిచి అధికారంలోకి వస్తుందని సిగ్గులేకుండా ప్రగల్భాలు పలుకుతున్నారు,” అని కేసీఆర్ అన్నారు. 

చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మహానాడులో ప్రసంగించిన చంద్రబాబు కనీసం కేసీఆర్ పేరు కూడా పలుకలేదు. తెలంగాణాలో తమ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి, ఎదురుదాడి చేస్తున్న తెరాసను, దాని అధ్యక్షుడు కేసీఆర్ ను పల్లెత్తు మాటనలేదు. ఒకప్పుడు తెలంగాణా రాజకీయాలను శాశించిన ఆయన వాటి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడారు. అలవాటు ప్రకారం హైదరాబాద్ ఐటి పార్క్, హైటెక్ సిటీ అభివృద్ధి కోసం తను చేసిన కృషి గురించి చెప్పుకొని ప్రసంగం ముగించారు. 

కానీ కేసీఆర్ మాత్రం అవకాశం చిక్కినపుడల్లా ఈవిధంగా చంద్రబాబు నాయుడిని, తెదేపాను చాలా నిర్మొహమాటంగా ఉతికి ఆరేస్తుంటారు. అదే..జగన్ చంద్రబాబుని ఒక్క మాట అంటే ఆయనపై తెదేపా నేతలందరూ మూకుమ్ముడిగా విరుచుకుపడతారు. కానీ వారిలో ఏ ఒక్కరు కేసీఆర్, తెరాస నేతలకు బదులిచ్చే సాహసం చేయలేకపోవడం ఆశ్చర్యమే కదా! అందుకు కారణాలు అందరికీ తెలుసు. 

తెలంగాణా తెదేపాలో రేవంత్ రెడ్డి ఒక్కరే ముఖ్యమంత్రి కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొంటున్నారు. మిగిలినవారు ఏదో మొక్కుబడిగా స్పందిస్తుంటారు. కనీసం చంద్రబాబు కూడా ఇటువంటి విమర్శలను పట్టించుకొన్న దాఖలాలు కనబడవు. అయితే రాజకీయదురందరుడైన చంద్రబాబు నాయుడి మౌనాన్ని కూడా తక్కువగా అంచనా వేయడం పొరపాటే అని చెప్పవచ్చు. ఆయన సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు భావించవచ్చు. అటువంటి అవకాశమే వస్తే కేసీఆర్ పై తప్పకుండా ప్రతీకారం తీర్చువడం ఖాయం. కానీ ఆయనకు ఎప్పటికైనా ఆ అవకాశం వస్తుందా? ఏమో? కాలమే చెప్పాలి. 


Related Post