టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ చేపట్టిన మిషన్ భగీరథ పధకంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ మంచి పధకమే. అయితే అనేక గ్రామాలలో ఇప్పటికే నీళ్ళు సరఫరా చేసేందుకు పైపులు, రక్షిత మంచినీటి ట్యాంకులు ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా పైప్ లైన్స్ వేయడం దేనికి? నీళ్ళ ట్యాంకులు నిర్మించడం దేనికి? ప్రస్తుతం ఉన్నవాటినే వినియోగించుకొంటే ఆ మేరకు ప్రజాధనం మిగిలుతుంది కదా? ప్రభుత్వం అనవసరంగా గొప్పలకు పోయి ప్రజాధనం వృధాగా ఖర్చు ఎందుకు చేస్తోందో మాకు అర్ధం కావడం లేదు. మేము ప్రభుత్వానికి ఉపయోగపడే మంచి సూచనలే ఇస్తుంటాము.
ఉదాహరణకు మేము క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టులను పరిశీలించినప్పుడు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేసినట్లయితే పశ్చిమం వైపు గల కరువు పీడిత ప్రాంతాలకు కూడా నీళ్ళు అందుతాయని చెప్పాము. కానీ మా సలహాలను ప్రభుత్వం సానుకూలంగా స్వీకరించే బదులు మమ్మల్ని శత్రువులుగా చూస్తోంది. వచ్చే నెల 4,5 తేదీలలో వరంగల్ లో టిజెఎసి సమావేశాలు నిర్వహించి, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించుకొని వాటి పరిష్కారం కోసం మా కార్యాచరణ ప్రకటిస్తాము,” అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
ప్రొఫెసర్ కోదండరామ్ సహేతుకంగానే చెపుతున్నట్లు అర్ధం అవుతోంది. అయితే ఆయన ప్రభుత్వం చేస్తున్న ప్రతీ పనిలో లోపాలు ఎంచుతూ ప్రతిపక్ష నేతలతో కలిసి తమపై విమర్శలు గుప్పిస్తుంనందునే తెరాస సర్కార్ ఆయనను శత్రువుగా భావిస్తున్నట్లు కనబడుతోంది. నిజానికి పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? అన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పార్టీలో, ప్రభుత్వంలో ఎవరూ సలహాలు చెప్పే సాహసం చేయలేరు. కానీ ప్రొఫెసర్ కోదండరామ్ ధైర్యంగా ఆ పని చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సూచనలను పరిగణ లోకి తీసుకొంటే మంచిదే. ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణా రాష్ట్రానికి శ్రేయోభిలాషే గానీ శత్రువు కాదు కదా.