రెండేళ్ళ ముందే ఎన్నికల వాతావరణం..వెరీ బ్యాడ్

May 29, 2017


img

ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ కుదురుకొని పాలనపై పట్టు సాధించడానికి కనీసం 6-12 నెలలు పడుతుంది. అప్పటి నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు అంటే నాలుగేళ్లపాటు నిలకడగా పాలన సాగితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో రెండేళ్ళ ముందే ఎన్నికల వాతావరణం వచ్చేసింది.

ఇక జాతీయ స్థాయిలో అయితే ప్రతీ 6-12 నెలలకొకసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికలనేవి ఒక నిరంతర ప్రక్రియగా మారిపోయాయి. వాటి వలన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉన్న పార్టీలు పాలన, అభివృద్ధిపై పూర్తిగా దృష్టి పెట్టి పనిచేయలేకపోతున్నాయి.

ఉదాహరణకు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ మొదలు అనేకమంది కేంద్రమంత్రులు ఏడాది ముందు నుంచే ఆయా రాష్ట్రాలలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వారు ప్రచారం మొదలుపెట్టేశారు కనుక ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షాలు కూడా ‘ఎన్నికల మోడ్’లోకి వెళ్ళకతప్పలేదు. ప్రభుత్వాలు ఎప్పుడూ ఎన్నికల యావలోనే ఉంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ దిశలోనే ముందుకు సాగకతప్పదు. కనుక ఈ నిరంతర ఎన్నికల ప్రక్రియకు ముగింపు చెప్పేసి దేశమంతటా ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. అయితే దాని అమలులో అనేక సమస్యలున్నాయి. అన్ని రాష్ట్రాల ఆమోదం, సహకారం కూడా దానికి అవసరమే. కనుక మోడీ సర్కార్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు చేస్తున్న ఎన్నికల హడావుడి వలన అధికారంలో ఉన్న తెరాస, తెదేపా సర్కార్ లు కూడా తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు వాటితో యుద్దాలు చేయకతప్పడం లేదు. ఇది వాటి పనితీరుపై చాలా ప్రభావం చూపక మానదు. అలాగే వివిధ రంగాలలో అభివృద్ధి కోసం అవి నిర్దేశించుకొన్న లక్ష్యాలవైపు పయనించడానికి ఈ వాతావరణం అనుకూలించదు.

ప్రతిపక్షాల హడావుడిని బట్టి తెరాస, తెదేపాలు కూడా తమ ప్రాధాన్యతలను మార్చుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిరావడం అందరూ చూస్తూనే ఉన్నారు. భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా పర్యటన, దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిస్పందన, తరువాత సర్వే ఫలితాల వెల్లడి మొదలైనవి అందుకు చక్కటి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావలసిరావడం గొప్ప విషయం కాదు. హర్షించవలసింది అంతకంటే కాదు.

అధికారంలోకి వచ్చిన ఏడాది వరకు, మళ్ళీ రెండేళ్ళ ముందుగానే ప్రభుత్వాలను నడిపిస్తున్నవారు ఈవిధంగా ఎన్నికల ప్రభావంలో ఉండిపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రతిపక్షాలకు వేరే పనేమీ ఉండదు కనుక అవెప్పుడూ ఎన్నికల కోసం చకోర పక్షుల్లా వేచి చూస్తూనే ఉంటాయి. దానికోసం ఏవో ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. కానీ వాటి కారణంగా అధికారపార్టీలు కూడా అదే యావలో పడితే చివరకు రాష్ట్రం, ప్రజలే నష్టపోతారు. కనుక అధికారంలో ఉన్న పార్టీలే ఈ ఎన్నికల యావలో పడకుండా నిగ్రహించుకొంటూ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టి పనిచేయడం అలవరచుకోవాలి.  


Related Post