తెదేపా నుంచి తెరాసలోకి ఫిరాయించి మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కోవాలని తెదేపాతో సహా ప్రతిపక్షాలు ఇంతవరకు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా స్పందించేవారే కాదు. కానీ నిన్న కొడంగల్ వచ్చి తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని, దమ్ముంటే తనను ఓడించాలని ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డికి సవాలు విసరడం ఏదో యాదృచ్చికంగా అన్న మాట కాదు కొంచెం ఆలోచించవలసిన విషయమేననిపిస్తుంది.
శతృశేషం..రుణశేషం..ఉండకూదదంటారు పెద్దలు. బద్ద శత్రువులైన తెదేపా, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలపడానికి సిద్దం అవుతున్నందున రాష్ట్రంలో తెదేపాకు మూలస్థంభం వంటి రేవంత్ రెడ్డిని రాజకీయంగా నిర్వీర్యం చేయడం ద్వారా తెదేపాను పూర్తిగా తుడిచిపెట్టేయవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారేమోననే అనుమానం కలుగుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెరాస 111 సీట్లు గెలుచుకోగలమని చాలా గట్టిగా చెపుతున్నారు. దానిపై ప్రతిపక్షాలు విసురుతున్న సవాలును స్వీకరించి తెరాస బలాన్ని మరోమారు నిరూపించుకొంటూనే, రాష్ట్రంలో ప్రతిపక్షాలను చావు దెబ్బ తీయడానికి కేసీఆర్ సిద్దం అవుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరూ కాకపోయినా మంత్రి తలసాని ఒక్కరే రాజీనామా చేసి రేవంత్ రెడ్డిని ఓడించినట్లయితే ఇక రాష్ట్రంలో తెదేపా ఆచూకి కనబడకుండాపోతుంది. ఒకవేళ తలసాని ఆ ఎన్నికలలో ఓడిపోయినా తెరాసకు దాని వలన మరీ అంత నష్టమేమీ జరుగదు అది పార్టీకి హెచ్చరికగా తీసుకొని మరింత బలోపేతం చేసుకోవచ్చు. బహుశః అందుకే తలసాని కొడంగల్ వెళ్ళి రేవంత్ రెడ్డికు సవాలు విసిరారేమో?లేకుంటే ఎప్పుడూ తన రాజీనామా, ఎన్నికల గురించి మాట్లాడటానికి ఇష్టపడని మంత్రి తలసాని ఈవిధంగా సవాలు చేయరు కదా?