భాజపాకు వద్దు..కాంగ్రెస్ కు ముద్దు!

May 27, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో తెదేపా చాలా విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. దానిని భాజపా గుదిబండగా భావించి వదిలించుకోవాలనుకొంటుంటే, తెదేపాతో స్నేహం కోసం దాని బద్ధ విరోధి కాంగ్రెస్ పార్టీ తెగ ఉవ్విళ్ళూరుతోంది. ఇక ఆంద్రాలో కూడా తెదేపా అనే మర్రిచెట్టు నీడ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా ఎదగాలని కొందరు భాజపా నేతలు గట్టిగానే వాదిస్తున్నారు. కానీ భాజపా అధిష్టానం అందుకు అంగీకరించకపోవడంతో తెదేపాతో బలవంతపు కాపురం చేయక తప్పడం లేదు. బహుశః ఆ కారణం చేతనే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సిగ్నల్స్ కు తెదేపా బదులు ఇవ్వలేకపోతోందని చెప్పవచ్చు. 

ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సిద్దమైన తరువాత అధిష్టానం ఒత్తిడి మేరకు తెదేపా, భాజపాలు మళ్ళీ చేతులు కలుపవలసి వస్తే అది ఇరుపార్టీలకు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. బహుశః అందుకే మొన్న హైదరాబాద్ లో జరిగిన మహానాడులో కాంగ్రెస్, భాజపాలతో పొత్తుల గురించి మాట్లాడకుండా తెదేపా నేతలు మౌనం వహించినట్లు చెప్పవచ్చు. అయితే తమతో స్నేహం కోరుకొంటున్న కాంగ్రెస్ హస్తం అందుకోకుండా, భాజపాతో పొత్తులు లేకుండా తెదేపా ఎన్నికలకు వెళ్ళినట్లయితే ఏమవుతుందో ఊహించవచ్చు. ఒకవేళ తెరాస మళ్ళీ ఆకర్ష మంత్రం వేసినా లేదా భాజపాలోకి ముఖ్యనేతలు ఎవరైనా ఫిరయించినా వచ్చే ఎన్నికల నాటికి తెదేపాలో ఇంకెవరైనా మిగులుతారా? అంటే అనుమానమే. ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఇంతగా బలహీనపడిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ తెదేపా వెంటపడటం ఆశ్చర్యకరమే.  


Related Post