భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణాలో మూడు రోజులు పర్యటించి వెళ్ళిన తరువాత తెరాస-భాజపాల మద్య మొదలైన మాటల యుద్ధమే ప్రధానంగా కనిపిస్తోంది. అయన పర్యటనతో రాష్ట్ర భాజపా నేతలలో చాలా ఉత్సాహంగా కనబడుతున్నప్పటికీ అది కేవలం తెరాసతో మాటల యుద్దానికే పరిమితం అయితే దాని వలన ఏమి ప్రయోజనం ఉండకపోవచ్చు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన ప్రతీసారి రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకొంటూ, రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయమని చెపుతున్నారు. కానీ రాష్ట్ర భాజపా నేతలు ఆ రెండింటిపై అంత శ్రద్ద పెడుతున్నట్లు లేదు. అందుకే అమిత్ షా మళ్ళీ మళ్ళీ అదే చెప్పవలసివస్తోంది. కనుక భాజపా నేతలు ఆయన సూచనలను తూచా తప్పకుండా పాటించేందుకు ప్రయత్నించనంత కాలం ఆయన ఎన్నిసార్లు రాష్ట్రంలో పర్యటించినా భాజపాకు ప్రయోజనం ఉండదు.
రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న భాజపాలో వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి ఎంత మంది అభ్యర్దులున్నారు? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నకు రాష్ట్ర భాజపా నేతలు నేతలు సమాధానం కనుగొనవలసి ఉంటుంది. తమ బలహీనతల గురించి పార్టీ అధ్యక్షుడే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా ఎత్తి చూపుతున్నప్పుడు రాష్ట్ర భాజపా నేతలు వాటిని సవరించుకొనే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది లేకుంటే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించినా ప్రయోజనం ఉండదు.