భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా పర్యటనకు మునుపు కూడా తెరాస, భాజపాల మద్య నిత్యం చిన్నపాటి యుద్దాలు జరుగుతూనే ఉండేవి. అవి అమిత్ షా రాకతో పతాకస్థాయికి చేరాయి. అమిత్ షా చేసిన వ్యాఖ్యల కంటే వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తీవ్రంగా స్పందించడమే ఆ వేడిని పెంచాయని చెప్పక తప్పదు. ఒకవేళ అమిత్ షా వ్యాఖ్యలను కేసీఆర్ పట్టించుకోకపోయుంటే బహుశః ప్రజలు కూడా వాటిని పట్టించుకొనేవారుకారేమో? ఎందుకంటే మోడీ, అమిత్ షా ఏ రాష్ట్రంలో పర్యటించినా ఆ రాష్ట్రం అభివృద్ధి కొరకు తాము ఏమేమి చేస్తున్నామో చెపుతూనే ఉంటారు. అది సహజమే కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంత తీవ్రంగా స్పందించడమే కొంచెం చిత్రంగా ఉంది.
కొన్నిరోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఎన్డీయే తరపున నిలబెట్టబోయే రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అమిత్ షా రాకతో తెరాస-భాజపాల సంబంధాలు బాగా దెబ్బతిన్నట్లు కనబడుతున్నాయి. కనుక ఇది తెరాసకు చిన్న అగ్నిపరీక్ష వంటిదే అని చెప్పవచ్చు.
ఒకవేళ మద్దతు ఇస్తే ‘తెరాస-భాజపాల మద్య రహస్య అవగాహన ఉంది.. కేసీఆర్ కేసులకు భయపడే మోడీకి అణగిమణగి ఉంటున్నారు’ అనే కాంగ్రెస్ వాదనలకు బలం చేకూర్చినట్లు అవుతుంది. ఒకవేళ మద్దతు ఈయకుంటే మోడీ సర్కార్ కు ఆగ్రహం తెప్పించినదవుతుంది. కనుక చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అయితే కాంగ్రెస్ వాదనలకు భయపడి కేంద్రప్రభుత్వంతో సంబంధాలు పాడుచేసుకోవడం అవివేకమే అవుతుంది కనుక ఎన్డీయే అభ్యర్ధికి తెరాస మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవ్వాళ్ళ తెరాస కీలక సమావేశం జరుగబోతోంది. దానిలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవచ్చు.