కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప అవినీతి బాగోతాలు..ఆ కారణంగా జైలు..బెయిలు కధలు అందరికీ తెలిసినవే. అవినీతిని వ్యతిరేకిస్తాం..నిర్మూలిస్తాం..మూడేళ్ళలో మా ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు..” అంటూ గొప్పలు చెప్పుకొనే భాజపాకు మళ్ళీ ఆయననే ఆశ్రయించవలసి వచ్చింది. ఎడ్యూరప్ప చాలా అవినీతిపరుడే కానీ చాలా సమర్ధుడైన రాజకీయ నేత...రాష్ట్రంలో బలమైన లింగాయత్ వర్గం అండదండలున్న వ్యక్తి కనుక ఆయన విషయంలో కాస్త చూసి చూడనట్లు పోవాలని నిర్ణయించుకొన్న భాజపా ఆయనకే రాష్ట్ర పార్టీ పగ్గాలు కట్టబెట్టింది.
దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఒక ప్రశ్నకు సమాధానంగా వచ్చే ఏడాది జరుగబోయే కర్నాటక శాసనసభ ఎన్నికలలో ఆయనే తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి మారుపేరని ఎప్పుడూ ఈసడించుకొనే భాజపా ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిర్ణయించుకొన్నందున, కాంగ్రెస్ పార్టీ కూడా ఎడ్యూరప్ప అవినీతి గురించి భాజపాను తప్పక నిలదీయవచ్చు. కనుక దానికి ఇప్పటి నుంచే తగిన సమాధానం సిద్దం చేసుకొంటే మంచిదేమో?