ఏపిలోను భాజపా తీరు అలాగే ఉందా?

May 26, 2017


img

తెలంగాణా భాజపా నేతలు మొదటి నుంచి తెదేపాతో పొత్తులను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చివరికి వారు కోరుకొన్నట్లే  జరిగింది. రాష్ట్రంలో తెదేపాకు కటీఫ్ చెప్పేసి వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఆంధ్రాలో కూడా సోము వీర్రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి కొందరు భాజపా నేతలు కూడా తెదేపాను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ నేటికీ తెదేపా-భాజపాలు కలిసే ఉన్నాయి. అయితే సమయం చిక్కినప్పుడల్లా వారు తెదేపా నేతలపై, తెదేపా సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా గురువారం విజయవాడలో భాజపా బూత్ స్థాయి కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగిస్తున్నప్పుడు కొందరు కార్యకర్తలు లేచి నిలబడి “తెదేపాతో పొత్తులు తెంచుకొందాం. భాజపాను రక్షించుకొందాం” అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెదేపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా వేదిక మీద ఉన్నప్పుడే ఈ సంఘటన జరగడంతో భాజపాలో తెదేపాను వ్యతిరేకిస్తున్న వర్గం ఈవిధంగా నేరుగా ఆయనకే బహిరంగంగా తమ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేసినట్లు భావించవచ్చు. 

అయితే తెలంగాణా భాజపాకు ఎంతో కొంత బలముంది కానీ ఆంధ్రాలో మాత్రం దాని బలం అంతంత మాత్రమే. రాష్ట్ర ప్రజలలో చాలా మంది తెదేపా, వైకాపాల మద్యనే చీలిపోయున్నారు. ఏపిలో కులసమీకరణాల ప్రభావం కూడా చాలా ఎక్కువే. పైగా కాంగ్రెస్, వైకాపాలు ప్రత్యేకహోదా, రైల్వే జోన్ ఏర్పాటు వంటి అంశాలపై చేసిన పోరాటాల కారణంగా ప్రజలలో భాజపా పట్ల కొంత వ్యతిరేకత నెలకొని ఉంది. దానిని పవన్ కళ్యాణ్ వంటివారు మరికాస్త పెంచుతున్నారు. కనుక తెదేపా, వైకాపాలలో ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకొంటే తప్ప ఏపిలో భాజపా మనుగడ కష్టమేనని చెప్పక తప్పదు. 

ఈ నేపద్యంలో తెదేపాతో విడిపోవాలని భాజపాలో ఒకవర్గం కోరుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వారు వైకాపాతో జత కట్టాలనే కోరికతోనే తెదేపాతో సంబంధాలు తెంచుకోవాలనుకొంటున్నరేమో? అనే సందేహం కలుగుతోంది. కానీ వచ్చే ఎన్నికలలో కూడా తెదేపా, భాజపాలు కలిసే పని చేస్తాయని చంద్రబాబు చెపుతున్నారు. అమిత్ షా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. మరి తెదేపాను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర భాజపా నేతలు ఏమి చేస్తారో చూడాలి. 


Related Post