భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా పర్యటనలో తెరాస సర్కార్ పై చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తీవ్రంగా స్పందించడం ఆయనలో అభద్రతాభావానికి అద్దం పడుతున్నట్లుంది. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధులు, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ఆయన వాదనలు 100 శాతం నిజమే కావచ్చు. కానీ దాని కోసం ఆయన మరీ అంత తీవ్రంగా అమిత్ షాపై విరుచుకుపడనవసరం లేదు. ఎందుకంటే కేంద్రం తన హామీలను నిలబెట్టుకోలేదని, నిధులు విడుదల చేయకుండా చేసినట్లు చెప్పుకొంటోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏవిధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో, అదేవిధంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కూడా తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి అందరికీ తెలుసు. అంటే హామీల అమలు విషయంలో కేంద్రం మాట తప్పినట్లే తెరాస సర్కార్ కూడా మాట తప్పిందని స్పష్టం అవుతోంది.
అలాగే ఆచరణ సాధ్యమైన హామీలను కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్నట్లే, తెరాస సర్కార్ కూడా అమలుచేస్తోంది. హామీలన్నీ అమలుచేశామని, అవినీతిరహితంగా, చాలా పారదర్శకంగా దేశాన్ని శరవేగంగా అభివృద్ధి పధంలో పరుగులేట్టిస్తున్నామని కేంద్రప్రభుత్వం చెప్పుకొంటున్నట్లే తెరాస సర్కార్ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొంటోంది. కనుక అన్ని విషయాలలో కేంద్రప్రభుత్వాన్ని అనుసరిస్తున్నప్పుడు, అమిత్ షా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే కేసీఆర్ ఎందుకు ఉలికిపడుతున్నారు? అంటే అభద్రతాభావమేనని చెప్పక తప్పదు. ‘దక్షిణాదిన భాజపా అధికారంలోకి రాగల రాష్ట్రాలలో తెలంగాణా మొట్టమొదటి స్థానంలో ఉంది’ అని భాజపా నేతలు గట్టిగా చెపుతుంటే అధికారంలో ఉన్న ఇంకా మరో రెండు దశాబ్దాలైన అధికారంలో ఉండాలనుకొంటున్న కేసీఆర్ కు ఆందోళన కలగడం సహజమే. అందుకే ఆయన అంత తీవ్రంగా స్పందించారని భావించవచ్చు.