ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “నాకు ప్రజలే బాదుషాలు. వారే నా పరిపాలనకు మార్కులు వేస్తారు” అని అన్నారు. అది నూటికి నూరు శాతం నిజం. ఏ ప్రభుత్వమైన ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే దానిని పాలకులు చెపితే తప్ప గుర్తుపట్టలేనంత దుస్థితిలో ప్రజలు ఎన్నడూ లేరు. అయితే అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రభుత్వాలు చేపడుతున్న, సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పుకొని వారి ఆదరణ పొంది మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నించడం తప్పు కాదు. మోడీ, కేసీఆర్, చంద్రబాబు సర్కార్ లు కూడా ఇప్పుడు అదే చేస్తున్నాయి. కేసీఆర్ తన పాలనపై 100 శాతం సంతృప్తి చెందుతున్నప్పుడు ఇక డిల్లీ నుంచి వచ్చే బాదుషాలను చూసి భయపడవలసిన అవసరం ఏమిటి? కానీ కేసీఆర్ ఇంత ఆందోళన చెందుతున్నారంటే అర్ధం ఏమిటి?
తన ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు..ఎవరూ విమర్శించకూడదు.. ఎవరూ వేలెత్తి చూపకూడదు..ఎవరూ తమతో పోటీ ఉండకూడదు..శాశ్వితంగా మేమే రాజ్యం చేయాలనే ఆలోచనలు రాచరిక పోకడలే. అటువంటివి రాచరిక వ్యవస్థలో సాధ్యమే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యం కావని పదేపదే నిరూపితం అయ్యింది. కానీ రాచరిక లక్షణాలున్న కేసీఆర్ ఈ చేదు నిజాన్ని అంగీకరించడం, జీర్ణించుకోవడం కష్టమే కనుక ప్రజాస్వామ్య వ్యవస్థలో జరిగే సహజ పరిణామాలను చూసి ఇంతగా ఆందోళన చెందుతున్నారని భావించవలసి ఉంటుంది. అయితే ఆయన వద్ద తెలంగాణా సెంటిమెంటు అనే ఒక బ్రహ్మాస్త్రం ఉంది. దానిని ఉపయోగించుకోవడంలో ఆయనకు ఎవరూ సాటిరారు. అవసరం పడినప్పుడల్లా దానిని బయటకు తీసి ప్రయోగించి ఆత్మరక్షణ చేసుకొంటూ శత్రువులపై ఎదురుదాడి చేస్తుంటారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. ‘నా రాష్ట్రాన్ని విమర్శించేవారెవరైనా నా శత్రువులే..’ అన్న ఆయన మాటలే అందుకు నిదర్శనం. అయితే అమిత్ షా రాజకీయ ఉద్దేశ్యాలతో తెరాస సర్కార్ పై మాత్రమే విమర్శలు చేశారు తప్ప తెలంగాణా రాష్ట్రంపై కాదు. కానీ ఆయన తెలంగాణా రాష్ట్రాన్ని, ప్రజలను అవమానిస్తున్నట్లు ముఖ్యమంత్రి అభివర్ణిస్తూ ప్రజలు భాజపా వైపు మళ్ళకుండా అడ్డుకొనేందుకు ఆ బ్రహ్మాస్త్రాన్ని తీసి ప్రయోగించారు. దానికి వస్తున్న అనూహ్యమైన స్పందన చూస్తుంటే, ఆ అస్త్రం నేటికీ అంతే శక్తివంతంగా పనిచేస్తోందని స్పష్టం అవుతోంది.