భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల తెలంగాణా పర్యటన నేటితో ముగుస్తుంది. ఈ 3 రోజుల పర్యటనలో ఆయన తెరాస సర్కార్ పై చేసిన ప్రతీ విమర్శకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం చాలా ఘాటుగా బదులిచ్చారు.
ప్రగతి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎవరైనా తమ పార్టీలను ఏర్పాటుచేసుకోవచ్చు..వాటిని బలపరుచుకోవచ్చు. కానీ అందుకోసం తెలంగాణా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజలను అవమానిస్తే సహించబోము. అమిత్ షా ఇక్కడికి వచ్చి నోటికివచ్చినట్లు అబద్దాలు చెప్పి ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేయడమే కాకుండా మా ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపి కించపరిచే ప్రయత్నం చేశారు. ఆయన మాటలు విని నాకు చాలా బాధ కలిగింది. ఆయన అన్ని అబద్దాలు, మా ప్రభుత్వంపై అన్ని ఆరోపణలు, విమర్శలు చేసిన తరువాత కూడా నేను మాట్లాడకుండా మౌనంగా ఉంటే ప్రజలు ఆయన చెప్పిందే నిజమనుకొంటారు. అందుకే నేను అమిత్ షా చెప్పినవన్నీ అబద్దాలేనని నిరూపించడానికే మాట్లాడవలసి వస్తోంది.
మనకి లక్ష కోట్లు పైగా ఇచ్చామని అమిత్ షా చెప్పిన మాట అబద్దం. మనం కేంద్రానికి పన్నుల రూపేణా రూ.50,013 కోట్లు చెల్లిస్తుంటే అందులో సగం కూడా రాష్ట్రానికి తిరిగి ఇవ్వడం లేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలు చాలా మంచి ప్రాజెక్టులని కనుక వాటికి ఉదారంగా నిధులు మంజూరు చేయాలని నీతి ఆయోగ్ చెప్పినా కూడా కేంద్రప్రభుత్వం వాటికి నయాపైసా విదిలించలేదు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులలో రెండు వాయిదాలు మాత్రమే ఇచ్చింది. మూడవది ఇవ్వనేలేదు. ఏపికి మాత్రం ఇచ్చింది.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు రాష్ట్రంలో సరిగ్గా అమలుకావడం లేదని, గ్రామస్థాయి వరకు చేరడం లేదని అమిత్ షా చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లు ఇంకా చాలా మందికి కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే జీతాలు చెల్లించాలంటే వాళ్ళకి నెలకు 1,000-4,000 కంటే చెల్లించలేము. వారి సమస్యలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఇస్తున్న దానికి అధనంగా కొంత జోడించి వారికి ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నాము.
తెలంగాణా ధనిక రాష్ట్రం కనుకనే కేంద్రప్రభుత్వం సహకారం లేకున్నా అన్నీ సవ్యంగా నడిపించుకోగలుగుతున్నాము. అంతే కాదు..మన హైదరాబాద్ నుంచి ఐటి పరిశ్రమ ద్వారా ఏడాదికి లక్ష కోట్లు విదేశీ మారకాన్ని ఆర్జించి కేంద్రానికి ఇస్తూ దేశ ఆర్ధికవ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాము. కానీ అందుకు బదులుగా కేంద్రప్రభుత్వం మన రాష్ట్రానికి ఇస్తున్న నిధులు సముద్రంలో కాకి రెట్టంత కూడా లేవు.
మన రాష్ట్రం 19.5 శాతం అభివృద్ధి రేటు కలిగి ఉందని సాక్షాత్ కేంద్ర ఆర్ధిక శాఖే చెప్పింది. ఈ విధంగా అన్ని రంగాలలో మన రాష్ట్రం అభివృద్ధి సాధిస్తూ, అన్ని వర్గాల ప్రజలకు సమానావకాశాలు కల్పిస్తూ ముందుకు సాగిపోతుంటే అమిత్ షా నోటికి వచ్చినట్లు వాగి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పిన లెక్కలలో ఒక్క రూపాయి తేడా ఉందని అమిత్ షా నిరూపించినట్లయితే నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్దం. అమిత్ షాకు దమ్ముంటే నా సవాలును స్వీకరించాలి. లేకుంటే తను చెప్పినవన్నీ అబద్ధాలే అని ఒప్పుకొని మనప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలను కించపరిచినందుకు బేషరతుగా తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నేను అమిత్ షాను డిమాండ్ చేస్తున్నాను,” అని అన్నారు.